డిల్లీలో చైనా కెమెరాల లొల్లి

July 02, 2020


img

ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులకు సమానం అనే మాట నిత్యం వింటూనే ఉంటాము. ఇప్పుడు ప్రతీ చోట భద్రత కోసం సిసి కెమెరాలు అమర్చుతుండటంతో పోలీసులు నేరస్తులను సులువుగా పట్టుకోగలుగుతున్నారు. అయితే అవే సీసీ కెమెరాలు ఇప్పుడు దేశభద్రతను ప్రశ్నార్ధకంగా మార్చుతున్నాయంటే నమ్మగలమా? అవును నిజమే! 

మిగిలిన అన్ని వస్తువులలాగే మనం సిసి కెమెరాలు కూడా చైనా నుంచి భారీ స్థాయిలో దిగుమతి చేసుకొని అమర్చుకొంటున్నాము. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో వాటికి సంబందించి ఓ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొన్నట్లయితే మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాటిలో రికార్డ్ అవుతున్న దృశ్యాలను ప్రత్యక్షప్రసారంగా చూడగలుగుతున్నాము. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. 

ఆమాద్మీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా దేశరాజధాని డిల్లీలో ఏకంగా 1. 45 లక్షల సీసీ కెమెరాలను అమర్చుతోంది. డిల్లీ ప్రజలకు భద్రత కల్పించడానికి వాటిని అమరుస్తోంది. మంచిదే...కానీ చైనాకు చెందిన హిక్విజన్‌ కంపెనీ నుంచి దిగుమతి చేసుకొన్న ఆ సీసీ కెమెరాలలో రికార్డింగులను ‘లైవ్ ఫీడ్’ (ప్రత్యక్ష ప్రసారాలు) చూసేందుకు డిల్లీ ప్రజలు ‘హిక్విజన్‌ ఐవీఎమ్‌ఎస్‌-4500’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొంటున్నారు. తద్వారా తమ ఇళ్ళు, కార్యాలయాల నుంచి బయలుదేరేటప్పుడు వారు వెళ్లబోతున్న మార్గాలు, ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్స్ ఏమైనా ఉన్నాయా...ఉంటే వేరే ఏ మార్గంలో నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు వంటివి తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఇదే అంశం నిఘావర్గాలను, పోలీసులను కలవరపెడుతోంది. 

ఎందుకంటే, ప్రజలతో పాటు ఉగ్రవాదులు, చైనా నిఘావర్గాలు తదితరులు కూడా డిల్లీ గల్లీలను ప్రత్యక్షంగా చూడగలుగుతారు. అంటే డిల్లీపై దాడులకు కుట్రలు పన్నుతున్న పాక్‌ ఉగ్రవాదులు ఈ టెక్నాలజీ సాయంతో ఎప్పుడు ఏ ప్రాంతంలోనైనా సులువుగా ప్రవేశించి దాడులు చేసి సులువుగా తప్పించుకుపోవచ్చన్నమాట! 

ఒకపక్క కేంద్రప్రభుత్వం చైనా ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తుంటే, కేజ్రీవాల్ ప్రభుత్వం దేశరాజధాని డిల్లీలోనే చైనా సిసి కెమెరాలను అమర్చుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా వాటి వలన రాజధానిలో తిరిగే వివిఐపిల భద్రత కూడా ప్రశ్నార్ధకంగా మారుతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక డిల్లీ సమస్యే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే సమస్య ఏర్పడుతుంది. అయితే ఏ కంపెనీకి చెందిన సిసి కెమెరాలకైనా మొబైల్ ఫోన్ల ద్వారా లైవ్ ఫీడ్ చూసేందుకు ఇప్పుడు అవకాశం ఉంది కనుక చైనా కెమెరాలను పడేసినా సమస్య ఉండవచ్చు. ఈ సమస్యకు సైబర్ నిపుణులే పరిష్కారం చూపాలి.


Related Post