శభాష్ భారత్‌: అమెరికా

July 02, 2020


img

గతంలో చైనా సైనికులు భారత్‌ భూగాలలోకి చొచ్చుకువచ్చినప్పుడు భారత్‌ స్పందన చాలా పేలవంగా ఉండేది దాంతో చైనా చాలాసార్లు అకారణంగా పేట్రేగిపోయేది. అయితే కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారత్‌ తీరు మారిందని పాక్‌ విషయంలో పలుమార్లు రుజువైనా అలవాటులో పొరపాటుగా చైనా సేనలు కొన్ని నెలల క్రితం డోక్లాంలో అడుగు ముందుకువేయబోయి ఎదురుదెబ్బ తిని తోక ముడిచాయి. కానీ అది మరిచి మళ్ళీ గాల్వాన్ లోయలో అడుగుపెట్టి చైనా మరోసారి ఘోరతప్పిదం చేసింది. దాంతో భారత్‌ మళ్ళీ ధీటుగా స్పందించడమే కాకుండా ఈసారి చైనాను ఆర్ధికంగా దెబ్బ తీసేందుకు వరుసగా పలు నిర్ణయాలు తీసుకొని చురుకుగా అమలుచేస్తోంది. కరోనా దెబ్బతో కుదేలైన అగ్రదేశాలను చూసి ఇక తనకు ఎదురేలేదని పగటి కలలు కంటున్న చైనాకు భారత్‌ ఇస్తున్న షాకులు చూసి అమెరికా కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. 

అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో, ఆ దేశ రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ చైనాను భారత్‌ చాలా ధీటుగా ఎదుర్కొంటోందని ప్రశంశించారు. టిక్ టాక్‌ వంటి 59 చైనా యాప్స్ ను నిషేదించడం సామాన్య విషయమేమీ కాదని కానీ భారత్‌ చాలా ధైర్యంగా ఆ నిర్ణయాన్ని అమలుచేయడం తనకు చాలా ఆనందం కలిగిస్తోందని నిక్కీ హేలీ ట్వీట్ చేశారు. 

భారత్‌ అతిపెద్ద మార్కె ట్‌ అని, దాని ద్వారా చైనాకు భారీగా ఆదాయం వస్తోందని చైనా పాలకులకు తెలియదనుకోలేము. కానీ చైనా ఉత్పత్తులు, సేవలు, పెట్టుబడులు, సహాయసహకారాలు లేకుండా భారత్‌ మనుగడ సాగించలేదనే గుడ్డినమ్మకం, అహంకారం వారిలో ఉంది. అందుకే ‘భారత్‌ను రెచ్చగొట్టి స్వయంసంవృద్ధి సాధించే దిశలో అడుగులు వేయించినందుకు చైనాకు కృతజ్ఞతలని’ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌ చేశారు. దానిని చైనా ఓ హెచ్చరికగా గుర్తిస్తే ఇకనైనా ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడదు. 

కానీ భారత్‌ భూభాగంలో చొరబడినా ఏమీ చేయలేదనే అహంకారంతోనే అడుగు ముందుకు వేసింది. దీంతో డోక్లాం గుణపాఠం నుంచి చైనా ఏమీ నేర్చుకోలేదని స్పష్టం అవుతోంది. గల్వాన్ లోయను కబ్జా చేశామని చైనా వెర్రిభ్రమలో ఉంది. కానీ భారత్‌ ఒక్క తూటా కూడా పేల్చకుండానే తమను ఊపిరి ఆడకుండా చేస్తోంది. దాంతో చైనా ఇప్పుడు అదే లోయలో అడ్డంగా చిక్కుకుపోయినట్లయింది. 

ఈసారి చైనా వేసిన ఆ తప్పటడుగుకు చాలా భారీ మూల్యం చెల్లించేలా చేస్తోంది భారత్‌. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పటికే రైల్వే, ఉపరితల రవాణా, టెలికాం శాఖలు చైనాతో చేసుకొన్న పలు ఒప్పందాలను రద్దు చేసుకొన్నాయి. ఇక ముందు కూడా కేంద్రప్రభుత్వం ఇదేవిధంగా పట్టువిడవకుండా చైనా ఉత్పత్తులను, సేవలను, పెట్టుబడులను వదిలించుకోగలిగితే తప్పకుండా ఆత్మనిర్భర్ భారత్‌ (భారత్‌ స్వయంసంవృద్ధి) సాధ్యమే. అమెరికాతో సహా ప్రపంచదేశాలు కూడా చైనాపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో చర్యలు తీసుకోవడానికి సిద్దం అవుతున్నాయి. కనుక మున్ముందు చైనాకు కష్టాలు తప్పకపోవచ్చు.


Related Post