సరిహద్దుల వద్ద పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్న చైనాకు భారత్ ఈసారి వరుసగా షాకులు ఇస్తోంది. ఒకపక్క చైనా సైనికులు అడుగు ముందుకు వేయకుండా అడ్డుకొంటూనే మరోపక్క చైనాను ఆర్ధికంగా దెబ్బ తీయడానికి ఉన్న అన్ని అస్త్రాలను వరుసగా సందిస్తూ చైనాపై ఒత్తిడి పెంచుతోంది. ఇకపై చైనా కంపెనీలకు భారత్‌లోని రోడ్డు ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలులేకుండా నిషేదం విధించబోతున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. భారత్‌కు చెందిన వేరే కంపెనీను భాగస్వామిగా పెట్టుకొని జాయింట్ వెంచర్ పేరుతో పనులు చేపట్టకుండా చర్యలు తీసుకొంటామని చెప్పారు. అలాగే సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమలలో చైనా పెట్టుబడిదారులు భాగస్వాములు కాకుండా అడ్డుకొనేందుకు తగిన నియమనిబందనలు రూపొందిస్తామని నితిన్ గడ్కారీ చెప్పారు.
ప్రతీసారి చైనా సైనికులు భారత్ భూభాగాలలోకి జొరబడి హడావుడి చేయడం, కొన్నిరోజులు ఘర్షణ వాతావరణం కొనసాగిన తరువాత ఇరుదేశాలు వెనక్కు తగ్గడం పరిపాటిగా మారడంతో ఈసారి కూడా అలాగే జరుగుతుందని భావించిన చైనా గాల్వన్ లోయలో దుందుడుకుగా వ్యవహరించి 21 మంది భారత్ జవాన్లను పొట్టనపెట్టుకొంది. కానీ ఈసారి భారత్ చాలా తీవ్రంగా స్పందిస్తుండటంతో ఇప్పుడు చైనాకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు ఇరుక్కుపోయింది. ఇంతగా రెచ్చిపోయిన తరువాత వెనక్కు తగ్గితే భారత్ ధాటికి తట్టుకోలేక డ్రాగన్ తోక ముడిచిందని ప్రపంచదేశాలు భావిస్తే పరువు పోతుంది. అలాగని అడుగు ముందుకు వేద్దామనుకొంటే చైనా ఆర్ధిక మూలాలను భారత్ వరుసగా దెబ్బ తీస్తోంది. కనుక ఇప్పుడు చైనా పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా ఉందని చెప్పవచ్చు. కనుక ఇప్పుడు ఈ సమస్య నుంచి చైనా గౌరవప్రదంగా ఎలా బయటపడుతుందో చూడాలి.