రెండు రోజుల క్రితం కరాచీలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై జరిగిన దాడిలో భారత్ హస్తం ఉందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. భారత్ ప్రేరణతోనే ఈ దాడి జరిగిందని ముంబై తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రదాడి తరహాలోనే కరాచీలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై కూడా దాడి చేయాలని ప్రయత్నించారని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ పార్లమెంటులో చెప్పారు. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తామే ఈ దాడికి పాల్పడ్డామని ప్రకటించింది. వారికి భారత్ తెర వెనుక నుంచి అవసరమైన మద్దతు, సహాయసహకారాలు అందజేస్తోందని పాక్ చాలాకాలంగా ఆరోపిస్తోంది.
మూడేళ్ళ క్రితం ఏప్రిల్ 10వ తేదీన భారత్‌కు చెందిన కులభూషన్ జాదవ్ అనే వ్యక్తిని గూడచర్యం ఆరోపణల కింద పాక్ పోలీసులు బలూచిస్తాన్‌లో అరెస్ట్ చేశారు. అతను భారత్ గూడచారి అని బలూచిస్తాన్‌లో వేర్పాటువాదులను కలిసేందుకే వచ్చాడని పాక్ ఆరోపిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తామే దాడి చేసినట్లు ప్రకటించడంతో ఇమ్రాన్ ఖాన్, దానిని భారత్‌తో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారు. అయితే బలూచిస్తాన్‌లో పాకిస్థాన్ సైనికులు చేస్తున్న హత్యలు, అత్యాచారాలు, అరాచకాలను తట్టుకోలేకనే అక్కడి ప్రజలు వేర్పాటువాదం వైపు మొగ్గారు.
భారత్ ఏనాడూ ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాకు మద్దతు పలికిన దాఖలాలు లేవు. పైగా ఉగ్రవాద పీడిత దేశమైన ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి భారీగా నిధులు ఇచ్చి స్వయంగా అక్కడ అనేక నిర్మాణాలు చేపడుతోంది. కానీ పాకిస్థాన్ మాత్రం గత 3-4 దశాబ్ధాలుగా కశ్మీరులో వేర్పాటువాదులను ప్రోత్సహిస్తూ, భారత్ నుంచి కశ్మీరును విడదీయాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి నిత్యం భారత్‌పైకి పంపించి అల్లకల్లోలం సృష్టించేందుకు కుట్రలు పన్నుతూనే ఉంది. ముంబై దాడుల గురించి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో ప్రస్తావించడం, ఆ దాడులకు మూల సూత్రధారి హఫీజ్ సయ్యద్‌కు నేటికీ పాకిస్థాన్‌లో రక్షణ కల్పిస్తుండటం గమనిస్తే పాక్ ద్వందవైఖరి అర్ధమవుతుంది.