మంగళవారం ఉదయం మార్కుక్ మండలం శివారు వెంకటాపూర్‌లో మొల్లోనికుంట సమీపంలో కొండపోచ్చమ్మ సాగర్ కాల్వకు గండి పడింది. కాలువ పక్కనే ఉన్న సుమారు 30 ఎకరాలలో మిర్చి, టోమెతో, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. నీతి ఉదృతి ఎక్కువగా ఉండటంతో గ్రామంలో ఇళ్ళలోకి కూడా నీళ్ళు చేరడంతో బట్టలు, బియ్యం వగైరా ఆహార పదార్దాలు, టీవీలు వగైరా నీట మునగడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకొన్న నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరేరామ్, ఎస్ఈ వేణు, ఈఈ బద్రీనారాయణ తదితరులు హుటాహుటిన కాల్వ వద్దకు చేరుకొని రిజర్వాయర్ గెట్లను మూయించివేసి జేసీబీతో గండిని పూడ్చివేయించారు. కాంట్రాక్టర్ నాసిరకమైన పనులు చేసినందునే గండి పడిందని గ్రామస్తులు ఆరోపించారు. కానీ కాలువ సామర్ధ్యం 195 క్యూసెక్కులు కాగా సోమవారం రాత్రి 295 క్యూసెక్కులు విడుదల చేయడంవలననే కాలువ దెబ్బ తిందని అధికారులు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులలో ఇటువంటి ఘటనలు జరుగుతుంటాయని, ఇవి సర్వసాధారణమైన విషయమేనని అధికారులు చెప్పారు. కాలువ లైనింగ్ కొత్తగా వేసింది కావడంతో క్రమంగా నీటి విడుదలను పెంచాలని కానీ సోమవారం రాత్రి 100 క్యూసెక్కులు అదనంగా విడుదల చేయడం వలన కాలువపై ఒత్తిడి పెరిగి గండిపడిందని అధికారులు చెప్పారు.
ఇంతకు ముందు గజ్వేల్ మండలంలో కొడకండ్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద పంప్‌హౌస్ సమీపంలో కాలువ లైనింగ్ దెబ్బ తిని గండి పడింది. ఆ తరువాత కొండపాక మండలంలోని ఎర్రవల్లి వద్ద కాలువలాకు గండి పడింది. వాటికి మరమత్తులు చేయగానే ఇప్పుడు శివారు వెంకటాపూర్‌లో మళ్ళీ గండి పడింది. గ్రామస్తులు చెప్పినట్లు కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేయడం వలననే ఈవిధంగా గండ్లు పడుతున్నట్లయితే అది ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగిస్తుంది. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం కల్పిస్తుంది. అధికారులు చెపుతున్నట్లు కాలువల సామర్ధ్యానికి మించి నీటిని విడుదల చేయడం వలననే గండి పడితే ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు అన్ని జాగ్రతలు తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే నాసిరకం పనుల కారణంగానే కాలువలకు గండ్లు పడుతున్నాయనే ప్రతిపక్షాల వాదనకు బలం చేకూర్చినట్లవుతుందని అధికారులు మరిచిపోకూడదు.