మంగళవారం సాయంత్రం దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మొట్టమొదట కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికే ఇవ్వాలనుకొంటున్నట్లు చెప్పారు. వారందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు కనుక ముందుగా వారిని కాపాడుకోవడం చాలా అవసరమని అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఆ తరువాత కరోనాతో పోరాడుతున్న నాన్ మెడికల్ సిబ్బంది, సాధారణ ప్రజలలో కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ‘స్థానికత’ ఆధారంగా కాకుండా దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితులలో ఉన్నవారందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. కరోనా వ్యాక్సిన్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరలలో ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు.
అయితే క్రమశిక్షణారాహిత్యం, అవినీతి వంటి అవలక్షణాలున్న భారత్‌లో ప్రధాని మోడీ చెప్పినట్లు ముందుగా అత్యవసరమైన వారికే కరోనా వ్యాక్సిన్ అందితే అది చాలా గొప్ప విషయమే అవుతుంది. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ సిద్దంగా కాగానే దేశంలో అధికారం, డబ్బు, పలుకుబడి ఉన్నవారు ముందుగా వాటిని పొందాలని గట్టిగా ప్రయత్నిస్తారు. ఏదోవిధంగా ముందుగా దానిని దక్కించుకొని తమకు, తమ బంధుమిత్రులకు వినియోగించుకోవాలని ప్రయత్నించడం తధ్యం. పైగా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. కనుక వాటిని తయారుచేసే మందుల కంపెనీలు భారీగా లాభాలు ఆర్జించడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఉండదు. కనుక ఏ దేశంలో ముందుగా వ్యాక్సిన్ తయారైనా దాని ధర చాలా ఎక్కువగానే ఉండవచ్చు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ చాలా భారీ స్థాయిలో ఉత్పత్తి చేసినా అది సామాన్య ప్రజలకు చేరేందుకు సుమారు 6-7 నెలలు సమయం పట్టవచ్చు. ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ విడుదలవుతుందనుకొంటే అది వచ్చే ఏడాది జూన్-జూలై నాటికి సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావచ్చు. అంటే మరో ఏడాదిపాటు సామాన్యప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురుచూడవలసి రావచ్చు. కనుక అంతవరకు అందరూ కరోనా భారీన పడకుండా తమను తాము కాపాడుకోక తప్పదు.