కరోనా...లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న అమెరికా ప్రభుత్వం అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెంచేందుకుగాను ఈ ఏడాది డిసెంబర్ వరకు హెచ్-1బీ వీసాల జారీని నిలిపివేసింది. దాని వలన అమెరికన్లకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో తెలియదు కానీ విదేశీ ఉద్యోగులకు సంబందించి అన్ని వ్యవహారాలు చూసే యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసస్ (యుఎస్‌సిఐఎస్) ఉద్యోగులకు కూడా ట్రంప్ సర్కార్ షాక్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆ సంస్థలో సుమారు 20,000 మంది పనిచేస్తుండగా వారిలో ఏకంగా 13,000 మందికి ఆగస్ట్ 3వ తేదీ నుంచి నెలరోజుల వరకు విధులకు హాజరుకానవసరం లేదని సందేశాలు పంపించింది. దానిని మరో 3 నెలలు లేదా మరికొన్ని నెలలు పొడిగించవచ్చునని తెలియజేసింది. శలవులో ఉన్న కాలంలో జీతాలు చెల్లించబడవు కనుక దీనిని లే-ఆఫ్ గా భావించవచ్చు. ఈ సందేశాలు అందుకొన్న 13,000 మంది ఉద్యోగులు అవి చూసి షాక్‌కు గురయ్యారు.
దీనిని యుఎస్‌సిఐఎస్ సంస్థ ప్రతినిధి దృవీకరిస్తూ, “కాంగ్రెస్(పార్లమెంటు) నిర్ణయం మేరకు దీనిని అమలుచేస్తున్నప్పటికీ, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మా ఉద్యోగులకు తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆగస్ట్ 3 నుంచి దీనిని అమలుచేయాలని నిర్ణయించాము. అదీగాక చట్టప్రకారం ఉద్యోగులకు 30 రోజుల ముందుగా తెలియజేయవలసి ఉంటుంది కనుక అందరికీ ఈవిషయం ముందుగానే తెలియజేశాము,” అని తెలిపారు.
యుఎస్‌సిఐఎస్ సంస్థ నిర్వహణకు ఏటా 14.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంటుంది. ఆ మొత్తాన్ని ఇమ్మిగ్రేషన్ ఫీజుల ద్వారా వచ్చే సొమ్ముతో సమకూర్చుకొంటుంది. కానీ ఇప్పుడు హెచ్-1బీ వీసాలతో సహా పలు వీసాల జారీపై ట్రంప్ సర్కార్ తాత్కాలికంగా నిషేధం విధించడంతో మార్చి నుంచి ఇమ్మిగ్రేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 50 శాతంకు పైగా తగ్గిపోయింది. ఇక ముందు ఇంకా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక యుఎస్‌సిఐఎస్ నిర్వహణ అమెరికా ప్రభుత్వానికి భారంగా మారడం సహజమే. అందుకే ఏకంగా 13,000 మందిని వేతనరహిత శలవు పేరిట తగ్గించుకొంటున్నట్లు అర్ధమవుతూనే ఉంది.
అయితే ఒకేసారి అంతమంది ఉద్యోగులు తగ్గిపోతే యుఎస్‌సిఐఎస్‌లో మిగిలిన కొద్దిపాటి ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయి ఆ వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అదే సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన 13,000 మంది, వారిపై ఆధారపడిన వారి కుటుంబాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొనే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా లక్షలాదిమంది అమెరికన్లు నిరుద్యోగులుగా మారి ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. కనుక ప్రస్తుత పరిస్థితులలో యుఎస్‌సిఐఎస్ ఉద్యోగులకు బయట ఉద్యోగాలు లభించడం చాలా కష్టమే. విదేశీ ఉద్యోగుల భారాన్ని తగ్గించుకోవాలని ట్రంప్ సర్కార్ హెచ్-1బీ తదితర వీసాల జారీని నిలిపివేస్తే, దాంతో యుఎస్‌సిఐఎస్‌లో పనిచేసే అమెరికన్ల ఉద్యోగాలు ఊడిపోవడం విశేషం.