కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలో ఆందోళనలు

June 27, 2020


img

దేశవ్యాప్తంగా గల 41 బొగ్గు గనులలో త్రవ్వకాలకు ప్రైవేట్ సంస్థలను అనుమతించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు సింగరేణి కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. టిఆర్ఎస్‌ అనుబంద కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) పిలుపుమేరకు నేడు సింగరేణిలో ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల వద్ద, కార్యాలయాల వద్ద కార్మికులు కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మలు తగులబెట్టి నిరసనలు తెలియజేశారు. 

కరోనా..లాక్‌డౌన్‌ కారణంగా దేశ ఆర్ధిక పరిస్థితి దెబ్బ తినడంతో కేంద్రప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్‌ పేరుతో సుమారు రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దేశంలో ఉన్న బొగ్గు గనులు దశాబ్ధాలుగా నియంత్రిత విధానంలో నడుస్తున్నాయని, ఇప్పుడు వాటిపై ఆ లాక్‌డౌన్‌ ఎత్తివేసి ఆన్‌లాక్‌ చేయవలసిన సమయం వచ్చిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దశాబ్ధాలుగా ప్రభుత్వాల చేతిలో నడుస్తున్న బొగ్గు గనులలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించడం ద్వారా దేశానికి భారీగా ఆదాయం, భారీ సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు ఏర్పడుతాయని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అందుకే దేశంలో 41 బొగ్గు గనులలో వేలంపాట ద్వారా ప్రైవేట్ సంస్థలకు త్రవ్వకాలకు అనుమతించబోతున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఈ నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు నేడు ఆందోళనలు చేస్తున్నారు. 

బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే వాటిల్లో పని చేస్తున్న వేలాదిమంది కార్మికులు, వారికుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది కనుక కేంద్రం నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని కార్మిక నేతలు చెపుతున్నారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసనగా జూలై 2వ తేదీన సింగరేణితో దేశవ్యాప్తంగా 41 బొగ్గు గనులలో పనిచేస్తున్న కార్మికులు ఒక్కరోజు సమ్మె చేయబోతున్నారు.


Related Post