ప్రైవేట్ ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు వద్దు

June 27, 2020


img

తెలంగాణతో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో ఐసీఎంఆర్ నిబందనలు, మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలపడంతో కరోనా వ్యాపారం మొదలైపోయింది. రాష్ట్రంలో ప్రైవేట్ ల్యాబ్‌లు సమర్పించిన పరీక్ష ఫలితాలలో చాలా అవకతవకలున్నట్లు గుర్తించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెంటనే సీనియర్ మైక్రోబయాలజిస్టులు, ఉన్నతాధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించగా, దాదాపు అన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌లలో ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుండా, సరైన సదుపాయాలు లేకుండా కరోనా శాంపిల్స్ ను పరీక్షిస్తున్నట్లు తేలింది. పీపీఈ కిట్లను ధరించకుండానే సిబ్బంది కరోనా పరీక్షలు చేస్తున్నట్లు కనుగొన్నారు.

కరోనా పరీక్షలు చేసి రిపోర్టులు తయారుచేస్తున్న వారిలో చాలా మందికి దాని గురించి సరైన అవగాహనే లేదని తేలింది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు జరిపి డబ్బులు సంపాదించుకోవాలనే యావతో హడావుడిగా పరీక్షలు జరిపి రిపోర్టులు తయారు చేస్తున్నారని కొన్నిటిలో కరోనా లక్షణాలున్నవారికి నెగెటివ్ అని, లేనివారికి పాజిటివ్ అని రిపోర్టులు తయారుచేస్తున్నట్లు కనుగొన్నారు. కరోనా లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయవద్దని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ, కరోనా పరీక్షల కోసం ల్యాబ్‌లకు వచ్చినవారందరికీ పరీక్షలు చేస్తున్నట్లు కనుగొన్నారు. కరోనా పరీక్షలకు సంబందించి రికార్డులు కూడా సరిగ్గా నిర్వహించడంలేదని నిపుణుల బృందాలు కనుగొన్నాయి.

ఇంకా అనేక లోపాలను గుర్తించిన నాలుగు నిపుణుల బృందాలు నివేదిక తయారుచేసి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సమర్పించాయి. మళ్ళీ మరోసారి తనికీలు చేసి అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కరోనా పరీక్షలపై నిషేదం విధిస్తే మంచిదని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు చేస్తున్నవారికి, సిబ్బందికి, అక్కడికి వచ్చే ఇతర ఇతర రోగులకు కూడా సహా అందరికీ కరోనా సోకే ప్రమాదం ఉందని నివేదికలో హెచ్చరించారు.


Related Post