భారత్‌కు అమెరికా సేనలు?

June 26, 2020


img

చైనా నుంచి సవాళ్ళు ఎదుర్కొంటున్న అనేక దేశాలలో భారత్‌ కూడా ఒకటి. చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్దంగా ఉన్నప్పటికీ చైనాకు అత్యాధునిక యుద్ధవిమానాలు, సబ్ మెరైన్లు, ఆయుధాలు ఉన్నందున ప్రత్యక్ష యుద్ధం జరిగితే భారత్‌ ఎన్నో రోజులు చైనాను నిలువరించలేకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఈసారి భారత్‌-చైనాల మద్య ప్రత్యక్షయుద్ధం జరిగితే తాము కూడా చాలా భారీ మూల్యం చెల్లించకతప్పదని చైనా పాలకులకు బాగా తెలుసు. ఆ భయమే యుద్ధోన్మాద చైనాను అడుగు ముందుకు వేయకుండా ఆపుతోందని చెప్పవచ్చు. 

అయినప్పటికీ చైనా దూకుడు చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది కనుక అవసరమైతే భారత్‌కు అండగా అమెరికా దళాలను పంపించే ఆలోచనలు చేస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. బ్రజెల్స్ ఫామ్ 2020లో ప్రసంగిస్తూ, “జర్మనీలో ఉన్న 52,000 అమెరికా సైనికులలో 27,000 మందిని వెనక్కు రప్పించుకోవాలనుకొంటున్నాము కనుక అవసరమైతే వారిని చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న భారత్‌, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం వంటి దేశాలకు పంపిస్తాము. చైనా నుంచి మా మిత్ర దేశాలకు ముప్పు వాటిల్లుతుందంటే వాటికి అండగా నిలిచేందుకు వెనకాడబోము. ఐరోపాలో మా భాగస్వామి దేశాలతో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకొంటాము. ఆ తరువాత క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి మా సైన్యాన్ని ఎక్కడ మోహరించాలో మా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నిర్ణయిస్తారు,” అని అన్నారు.

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి వలన అమెరికా తీవ్రంగా నష్టపోతుండటంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇటువంటి వ్యతిరేక పరిస్థితులు నెలకొని ఉండటం ట్రంప్‌కు ఆందోళన కలిగించడం సహజమే. అందుకే కరోనా సమస్యను చైనా మెడలో వేసేందుకు ట్రంప్‌ పదేపదే ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన లక్షలాది భారతీయులను ఆకట్టుకొని వారి ఓట్లు పొందడం కోసమే ఈ తాజా ప్రతిపాదన కూడా తెరపైకి తెచ్చి ఉండవచ్చు. కానీ ప్రత్యక్ష యుద్ధం లేనప్పుడు భారత్‌కు అమెరికా సేనల మద్దతు అవసరం ఉండదనే చెప్పాలి. అవసరం లేకపోయినా వారిని తెచ్చిపెట్టుకొంటే వారు భారత్‌కు తెల్ల ఏనుగులాగ భారంగా మారుతారు. కనుక అమెరికా ప్రతిపాదనకు భారత్‌ అంగీకరించకపోవచ్చు.


Related Post