అక్టోబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ రెడీ?

June 26, 2020


img

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో కరోనా చికిత్సకు మందులు అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమైన విషయమే కానీ కరోనా సోకకుండా కాపాడుకొనేందుకు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అది వస్తే తప్ప ప్రపంచంలో కరోనా మహమ్మారిని అడ్డుకోవడం సాధ్యం కాదు. అప్పటి వరకు ప్రజలు కరోనాబారిన పడుతూనే ఉంటారు కనుక దాని కోసం యావత్ ప్రపంచదేశాలలో ప్రజలు, ప్రభుత్వాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. 

కరోనాపై పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ తయారుచేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలకు నాయకత్వం వహిస్తున్న ఆడ్రియన్‌ హిల్‌ ఈ ఏడాది అక్టోబర్‌నాటికి కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల చింపాంజీలపై జరిపిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని మనుషులపై కూడా ప్రయోగాలు మొదలుపెట్టామని చెప్పారు. 

కరోనా సోకకుండా వ్యాక్సిన్ తయారుచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 ప్రఖ్యాత సంస్థలు కృషి చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, చైనా, బ్రిటన్, అమెరికా దేశాలలో ఇప్పటికే మానవ ప్రయోగాలు మొదలయ్యాయి. వాటిల్లో సత్ఫలితాలు వస్తే వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెడతాయి. 

ప్రపంచంలో చాలా దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసే పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సిద్దంగా ఉంది. కనుక ఈ ఏడాది చివరిలోగా భారత్‌తో సహా ప్రపంచదేశాలన్నీ కరోనా నుంచి విముక్తిపొందే అవకాశం ఉంది. అయితే అంతవరకు కరోనా బారిన పడకుండా ఎవరికివారు జాగ్రత్తపడవలసి ఉంటుంది.      



Related Post