భారత్‌లో ఒకే రోజున 16,922 పాజిటివ్ కేసులు నమోదు

June 25, 2020


img

భారత్‌లో గత 24 గంటలలో16,922 పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ తెలియజేసింది. ఒకే రోజున ఇన్ని కేసులు నమోదవడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. ఇప్పటివరకు రోజుకు 10-11 వేల కొత్త కేసులు నమోదవుతుండేవి. రెండు రోజుల క్రితం 10 వేలలోపు కేసులు నమోదవడంతో కరోనా అదుపులోకి వస్తోందని భావించారు. కానీ హటాత్తుగా 11 నుంచి 16వేలకు పెరిగిపోవడంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అయితే గత 24 గంటలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 2.07 లక్షల కరోనా పరీక్షలు చేయడం వలననే ఒకేసారి ఇన్ని కేసులు బయటపడి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ దేశంలో కరోనా రోగులు పెరుగుతున్నారని దీంతో స్పష్టం అయ్యింది. దేశంలో నేటి వరకు 4,73,105 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే లెక్కన కరోనా వ్యాపిస్తున్నట్లయితే ఒకటి రెండు రోజులలోనే 5 లక్షలకు చేరుకోవచ్చు. 

దేశంలో కరోనా రోగుల సంఖ్య పెరిగినకొద్దీ అది ఇతరులకు వ్యాపించే ప్రమాదం పెరుగుతుంటుంది. కనుక దేశప్రజలందరూ మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కానీ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో అసలు కరోనా లేదన్నట్లు ప్రజలు చాలా నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. కనుక ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం కూడా  కరోనా పెరుగుదలకు ఓ కారణమని చెప్పక తప్పదు.  

దేశంలో కరోనా రోగులు పెరుగుతున్నప్పటికీ వారిలో 52 శాతం పైగా కోలుకొంటుండటం చాలా ఊరట కలిగించే విషయం. దేశంలో నేటి వరకు 4,73,105 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 2,71,697 మంది కోలుకొన్నారు. నేటి వరకు మొత్తం 14,894 మంది కరోనాతో మరణించారు. అయితే వారిలో వృద్ధులు, దీర్గకాలిక వ్యాదులతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 1,86,514 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 75, 60,782 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ తెలియజేసింది. 

దేశంలో కరోనా రోగులు పెరుగుతున్న సమయంలోనే కరోనా నివారణకు రెండు మందులు మార్కెట్లోకి విడుదలకావడం శుభపరిణామమే అని చెప్పవచ్చు. 


Related Post