పతంజలికి కేంద్రం హెచ్చరిక: వాటి గురించి ప్రచారం చేయొద్దు

June 24, 2020


img

యోగాగురు బాబా రాందేవ్‌కు స్థాపించిన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ మంగళవారం ‘దివ్య కరోనా కిట్’ పేరుతో కరోనా నివారణకు మూడు రకాల మందులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా బాబా రాందేవ్ మాట్లాడుతూ, “కరోనా వైరస్ పుట్టుకొచ్చినప్పటి నుంచి మా సంస్థలో సుదీర్ఘంగా పరిశోధన, ప్రయోగాలు చేసి కరోనిల్, శ్వాసరి మరియు అను టెల్ అనే మూడు రకాల మందులను తయారుచేశాము. ఈ మూడింటినీ కలిపి దివ్యా కరోనా కిట్‌గా అందిస్తున్నాము. ‘ఆర్డర్ మీ’ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో వీటిని పొందవచ్చని బాబా రాందేవ్ చెప్పారు. దీని ధర రూ.545గా నిర్ణయించినట్లు తెలిపారు.   

 ఈ మందులను 280 మంది కరోనా రోగులపై ప్రయోగించి చూసి సంతృప్తికరమైన ఫలితాలు వచ్చిన తరువాతే మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ మందు వాడటం ప్రారంభించిన మూడు రోజులలోనే కరోనా రోగులు కొలుకొంటున్నారని, వారం రోజులలోనే పూర్తిగా కరోనా నివారణ అవుతుందని బాబా రాందేవ్ చెప్పారు. దీనిని పూర్తి ఆయుర్వేద పద్దతిలో తయారుచేసినందున దీనితో ఎటువంటి సైడ్-ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు. కరోనా నివారణకు ఇది అత్యంత శ్రేష్టమైన మందులని బాబా రాందేవ్ చెప్పారు. 

పతంజలి సంస్థ దీని గురించి కేంద్రప్రభుత్వానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖకు కానీ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా మార్కెట్లోకి విడుదల చేయడమే కాకుండా కరోనాకు అత్యంత శ్రేష్టమైన మందంటూ ప్రచారానికి కూడా సిద్దమైంది. దీనిపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆ మందుకు, క్లినికల్ ట్రయల్స్, వాటి ఫలితాలకు సంబందించిన పూర్తి వివరాలు అందజేయాలని, అప్పటివరకూ దాని గురించి మీడియాలో ఎటువంటి ప్రచారం, ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. వాటిని ఆయుష్ శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపింది. 

కరోనాకు వ్యాక్సిన్, నివారణకు మందును కనుగొనడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కృషి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా నివారణకు మందులు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. అయితే అవన్నీ చట్టబద్దంగా క్లినికల్ ట్రయల్స్ చేసి వాటి ఫలితాలను డిజిసిఎంకు నివేదించి దాని ఆమోదం పొందిన తరువాతే వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తాయి. కానీ పతంజలి సంస్థ తయారుచేసిన కరోనా మందులు మార్కెట్లోకి విడుదల చేసేవరకు కేంద్రానికి కూడా తెలియదని ఆయుష్ శాఖ ఆదేశాలతో అర్దమవుతోంది. కనుక పతంజలి కనుగొన్న కరోనా మందుపై క్షుణ్ణంగా మరోసారి పరీక్షలు జరిపి తెలుసుకోవలసిందే.


Related Post