హెచ్-1బీ వీసాల నిలిపివేతకి అదీ ఓ కారణమేనా?

June 24, 2020


img

అమెరికాలో ఉద్యోగాలకు వీలు కల్పించే హెచ్-1బీ వీసాల జారీని ఈ ఏడాది డిసెంబరు 31వరకు నిలిపివేయాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గూగుల్ అనుబంద సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ ట్రంప్‌ నిర్ణయాన్ని తప్పు పట్టారు. 

విదేశాల నుంచి వలసలు వచ్చినవారు అమెరికా ఆర్ధిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, సాంకేతిక రంగంలో అమెరికాను ప్రపంచదేశాలలో అగ్రస్థానంలో నిలిపారని సుందర్ పిచ్చాయ్ ట్విట్టర్‌లో అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ గూగుల్ సంస్థ నేడు ఈ స్థాయిలో ఉండటానికి కూడా వారే కారణమని పిచ్చాయ్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం నిర్ణయం తమను ఎంతో నిరాశపరిచిందని, అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు సంఘీభావం తెలుపుతున్నానని, రానున్న రోజులలో అందరికీ అవకాశం కల్పించే దిశలో తమ సంస్థ ముందుకు సాగుతుందని సుందర్ పిచ్చాయ్ ట్వీట్ చేశారు.

లాక్‌డౌన్‌ కారణంగా అమెరికాలో అనేక కంపెనీలు మూతపడటం...దాంతో లక్షలమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగభృతి కోసం దరఖాస్తు చేసుకొంటున్నారు. కనుక ఒక దేశాధ్యక్షుడిగా వారందరికీ మళ్ళీ ఉద్యోగాలు లేదా ఉపాధి అవకాశాలు కల్పించవలసిన బాధ్యత డోనాల్డ్ ట్రంప్‌ మీదే ఉందని భావించవచ్చు. అందుకే హెచ్-1బీ వీసాల జారీపై నిషేదం విదించారు. తద్వారా ఆ ఉద్యోగాలు అమెరికన్లకు లభిస్తాయని ట్రంప్‌ చెప్తున్నారు. దానిలో నిజానిజాలు, సాధ్యాసాధ్యాల సంగతిని పక్కన పెడితే అదొక్కటే కారణం కాదని కూడా చెప్పవచ్చు. ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి కనుక ట్రంప్‌ వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. 

గత ఎన్నికలలో ఆయన ‘అమెరికా ఫస్ట్… అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి’ వంటి ఆసక్తికరమైన నినాదాలు...హామీలతో అమెరికన్లలో జాతీయవాదం మేల్కొలిపి విజయం సాధించి అధికారం కైవసం చేసుకొన్నారు. అయితే ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యి లక్షకు పైగా ప్రజల మరణాలకు కారణం అయ్యారనే అపఖ్యాతి మూటగట్టుకొన్నందున, ఈసారి ఎన్నికలలో ప్రజలను ప్రసన్నం చేసుకొని తిరిగి వారి  ఆదరణ పొందాలంటే మళ్ళీ ఇటువంటిదేదో చేయకతప్పదు కనుకనే చేసి ఉండవచ్చు. 

దీంతో ట్రంప్‌ ఇప్పుడు విదేశీయుల, విదేశీ కంపెనీల దృష్టిలో విలన్ అయినప్పటికీ, వారి విమర్శలు సగటు అమెరికన్ల దృష్టిలో ట్రంప్‌ను హీరోని చేస్తాయి. ఈ అంశంపై మీడియాలో జరిగే చర్చలలో ట్రంప్‌పై విమర్శలు తప్పవు. వాటితో ఆయన అమెరికన్ల కోసం ఏటికి ఎదురీదుతున్నారనే భావన సగటు అమెరికన్లలో కలిగితే ట్రంప్‌ మళ్ళీ మరోమారు ఎన్నికలలో విజయం సాధించి అధ్యక్ష పదవి చేజిక్కించుకోగలరు.


Related Post