టిఆర్ఎస్‌లో చేరదలచుకోలేదు: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

June 23, 2020


img

మళ్ళీ చాలా రోజుల తరువాత తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపు వార్త ఒకటి వినబడింది. భద్రాచలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పోడెం వీరయ్య త్వరలో టిఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ మీడియాలో ఊహాగానాలు వినిపించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ అప్రమత్తమైంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెంటనే మధిరలోని తన నివాసంలో వీరయ్యతో సమావేశమయ్యి మీడియాలో వస్తున్న ఊహాగానాలపై వివరణ కోరారు. 

టిఆర్ఎస్‌లో చేరాలని తనపై ఒత్తిళ్ళు వస్తున్న మాట నిజమేనని కానీ లౌకిక, ప్రజాస్వామ్య విధానాలకు, భావప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చే కాంగ్రెస్ పార్టీని వీడి నియంతృత్వ పోకడలున్న టిఆర్ఎస్‌లో చేరదలచుకోలేదని వీరయ్య స్పష్టం చేశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని వీడి ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్ఎస్‌లో చేరవలసిన అవసరం తనకు లేదన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు టిఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి తనను కూడా టిఆర్ఎస్‌లోకి రప్పించుకోవాలని ఆ పార్టీ నేతలు చాలా రకాలుగా తనపై ఒత్తిడి చేస్తున్నారని వీరయ్య చెప్పారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే తాను పార్టీ మారబోతున్నానంటూ సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని పుకార్లు పుట్టిస్తున్నారని వీరయ్య అన్నారు. తాను రాజకీయాలలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను తప్ప వేరే పార్టీలోకి వెళ్ళబోనని స్పష్టం చేశారు.


Related Post