హైదరాబాద్‌లో హటాత్తుగా కేసులు ఎందుకు పెరిగాయి?

June 23, 2020


img

కొద్దిరోజుల క్రితం ఒక్క హైదరాబాద్‌లో తప్ప దాదాపు అన్ని జిల్లాలలో కరోనా నియంత్రణలోకి రావడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేసింది. ఆ తరువాత నుంచి రాష్ట్రంలో మళ్ళీ  మెల్లగా కరోనా కేసుల సంఖ్య పెరగసాగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడం ఒక కారణమని అర్ధమవుతోంది. కానీ అప్పటికీ హైదరాబాద్‌లో రోజుకు కేవలం 100-150 లోపు కొత్తకేసులు నమోదవుతుండేవి. కానీ ప్రభుత్వం కరోనా పరీక్షల సంఖ్యను పెంచినప్పటి నుంచే రోజూ భారీ సంఖ్యలో కొత్తకేసులు బయటపడటం ప్రారంభం అయ్యింది. 

జూన్ 19న 2,477 పరీక్షలు జరుపగా రాష్ట్రంలో కొత్తగా 499 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అదేవిధంగా జూన్ 20న 3,188 పరీక్షలకు 546, జూన్ 21న 3,297కి 730, జూన్ 22న 3,189 పరీక్షలు చేయగా 872 కేసులు బయటపడ్డాయి. అంటే కరోనా పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయని స్పష్టం అవుతోంది. ఒకవేళ ఇంకా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరిపితే ఇంకా ఎక్కువ కేసులు బయటపడే అవకాశం ఉందని భావించవచ్చు. ఆ లెక్కన రాష్ట్రంలో నేటివరకు బయటపడిన కరోనా కేసుల కంటే ఇంకా బయటపడనివే ఎక్కువ ఉండి ఉండవచ్చు కదా? 

కారణాలు ఏవైతేనేమి...ఇప్పటి వరకు ప్రభుత్వం తగినన్ని కరోనా పరీక్షలు నిర్వహించకపోవడం వలననే ఇంతవరకు కరోనా కేసులు బయటపడలేదని అర్ధమవుతోంది. అందుకే తగినన్ని కరోనా పరీక్షలు చేయకుండా రాష్ట్రంలో కరోనా లేదని ఏవిధంగా నిర్ధారిస్తారని హైకోర్టు పదేపదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. కనుక కరోనా వైరస్ మళ్ళీ రాష్ట్రమంతటా వ్యాపించకుండా అడ్డుకోవాలంటే ప్రభుత్వం కరోనా పరీక్షలను మరింత పెంచవలసి ఉంటుంది. 


Related Post