టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తే బిజెపి అధికారంలోకి వస్తుందా?

June 22, 2020


img

అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సహజమే. అందుకే కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, వాటికి ఈటల రాజేందర్‌ అంతే ఘాటుగా బదులిచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసినంత మాత్రన్న రాష్ట్రంలో బిజెపి బలపడుతుందా?ప్రజలు టిఆర్ఎస్‌ను కాదని బిజెపిని ఆదరిస్తారా?అంటే గత అనుభవాలను బట్టి చూస్తే కాదనే అర్ధమవుతుంది. 

బిజెపికి టిఆర్ఎస్‌కు ప్రత్యక్షంగా కలిగిస్తున్న నష్టం కంటే తెలంగాణలో బిజెపి అనుసరిస్తున్న ద్వంద విధానాలే ఆ పార్టీకి ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. 

కేంద్రప్రభుత్వం లేదా దాని అధికారులు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే, ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బిజెపి విమర్శిస్తుంటుంది. ఇదే విషయం టిఆర్ఎస్‌ పదేపదే స్పష్టంగా చెపుతున్నప్పటికీ బిజెపికి అర్ధం కాలేదనుకోలేము. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పధకాలను కేంద్రమే ప్రశంసించి, రైతుబంధు, మిషన్ భగీరథ వంటి కొన్ని పధకాలను కేంద్రమే అమలుచేస్తున్నప్పుడు, వాటిలో అవినీతి జరిగిందని, అక్రమార్జన కోసమే వాటిని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోందని జేపీ నడ్డా ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. 

బిజెపి విషయంలో టిఆర్ఎస్‌కు పూర్తి స్పష్టత ఉంది. అవసరమైనప్పుడు పూర్తి మద్దతు ఇస్తూ తద్వారా ప్రజాభిమానం పొందడమే కాకుండా టిఆర్ఎస్‌-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందనే కాంగ్రెస్‌ నేతల ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. దాని వలన టిఆర్ఎస్‌కు ఎటువంటి నష్టమూ లేదు కానీ బిజెపి మాత్రం ప్రజల నమ్మకాన్ని కోల్పోతోందని చెప్పవచ్చు. అదేవిధంగా నిధుల విడుదల వంటి కొన్ని అంశాలలో కేంద్రప్రభుత్వ వైఖరిని టిఆర్ఎస్‌ గట్టిగా ఎండగడుతూ రాష్ట్రానికి బిజెపి చేసిందేమీలేదననే భావన ప్రజలలో బలంగా నాటుకుపోయేలా చేయగలుగుతోంది. 

ఇక టిఆర్ఎస్‌ విషయంలో బిజెపి ఎప్పుడూ తడబడుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వ విధానాలను, దాని ప్రాజెక్టులు, పధకాలను కేంద్రం మెచ్చుకొంటుంటే బిజెపి నేతలు విమర్శిస్తుంటారు. అందువల్ల బిజెపి మాటలను ప్రజలు నమ్మలేకపోతున్నారు. కనుక బిజెపి నేతలు టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ఎంతగా నిందిస్తే అంతగా ప్రజలకు దూరమయ్యే అవకాశాలే ఎక్కువని గ్రహిస్తే మంచిది. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ముందుగా బలమైన నాయకత్వం, బలమైన పార్టీ క్యాడర్ ఏర్పాటుచేసుకొని టిఆర్ఎస్‌ పట్ల స్పష్టమైన వైఖరిని నిర్ధేశించుకోవలసి ఉంటుంది. లేకుంటే ఇంకా ఎంతకాలం టిఆర్ఎస్‌తో పోరాడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. 


Related Post