మాటలకు...వాస్తవాలకు పొంతన ఉందా లేదా?

June 20, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ నిన్న అఖిలపక్ష సమావేశంలో లడక్‌లోని గాల్వన్ వాలీ భారత్‌దేనని, దానిలో ఉన్న మన ఆర్మీ పోస్టులను చైనా స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. గాల్వన్ వాలీలో అంగుళం భూమి కూడా మనం కోల్పోలేదని, ఎట్టి పరిస్థితులలో దానిని వదులుకోబోమని స్పష్టం చేశారు. 

అయితే ప్రధాని నరేంద్రమోడీ ఈ మాటలు చెప్పిన కొద్దిసేపటికే చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియాన్ వాటిని ఖండించడమే కాకుండా గాల్వన్ వాలీ చైనాదేనని ప్రస్తుతం ఆ ప్రాంతమంతా తమ ఆధీనంలోనే ఉందని, భారత్‌ సైనికులు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తే గట్టిగా తిప్పికొట్టామని చెప్పారు.  చైనా వైపున్న గాల్వన్‌ వాలీలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి)లోకి భారత్‌ దళాలు చొరబడి అక్కడ రోడ్లు, వంతెనలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నించాయని, వాటిని చైనా దళాలు అడ్డుకొన్నాయని చెప్పారు. చైనా దళాలు చాలా సంయమనంతో వ్యవహరిస్తుంటే, భారత్‌ దళాలు వారిని కవ్వించే ప్రయత్నాలు చేస్తున్నాయని జావో లిజియాన్ ఆరోపించారు.    

ప్రధాని నరేంద్రమోడీ, జావో లిజియాన్ చెప్పిన ఈ విషయాలు పూర్తి భిన్నంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కనుక గాల్వన్ వాలీ ప్రస్తుతం ఎవరి అధీనంలో ఉంది?అనే సందేహం కలగడం సహజం. ఒకవేళ ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లు గాల్వన్ వాలీ భారత్‌ ఆధీనంలోనే ఉన్నట్లయితే అది తమదేనని వాదిస్తున్న చైనా చేతులు ముడుచుకొని కూర్చోందా?ఒకవేళ చైనా ప్రతినిధి చెపుతున్నట్లుగా ప్రస్తుతం గాల్వన్ వాలీ చైనా అధీనంలో (స్వాధీనం చేసుకోవడం) ఉండటం నిజమైతే అది భారత్‌ చేతిలో నుంచి జారిపోయిందా? అనే ప్రశ్నలకు కేంద్రప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 

ఈ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాలు తమ యుద్ధవిమానాలు, ఆయుధాలు, సైన్యాలను సరిహద్దుల వద్దకు తరలిస్తున్నాయి. అయితే అణ్వాయుద దేశాలైన భారత్‌-చైనాలు ప్రత్యక్షయుద్ధానికి దిగే సాహసం చేస్తాయనుకోలేము. మరికొన్ని రోజులు సరిహద్దుల వద్ద హడావుడి చేసిన తరువాత అమెరికా తదితర అగ్రరాజ్యాల జోక్యంతో ఎప్పటిలాగే మళ్ళీ వెనక్కు మళ్ళవచ్చు. 

కానీ చైనాకు రాజ్య విస్తీర్ణకాంక్ష, కపటగుణం రెండూ ఎక్కువే కనుక భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు, ఉద్రిక్తతలు పునరావృతం అవుతూనే ఉండవచ్చు. కనుక ఏవో తాత్కాలిక ఉపాయలతో చైనాను ఎదుర్కోవడంతో సరిపెట్టకుండా సిఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా స్వల్పకాలిక, దీర్గ కాలిక వ్యూహాలను అమలుచేసి చైనా దూకుడుకు కళ్ళెం వేయడం మంచిది. 


Related Post