భారత్‌పై విషం కక్కుతున్న గ్లోబల్ టైమ్స్ పత్రిక

June 19, 2020


img

చైనా ప్రభుత్వ కనుసన్నలలలో నడుస్తున్న గ్లోబల్ టైమ్స్ పత్రిక చైనా పాలకుల మనసులో మాటలనే పలుకుతోంది. అది సహజమే కానీ తద్వారా భారత్‌ పట్ల చైనా పాలకులకు ఎంత హీనమైన అభిప్రాయాలున్నాయో తెలుస్తోంది. చైనా సైనికుల దాడిలో 20 మంది భారత్‌ జవాన్లు మరణించారనే విషయం చెప్పకుండా, భారత్‌-చైనా ఘర్షణల కారణంగా భారత్‌లో కొన్ని ‘చైనా వ్యతిరేక శక్తులు’ అమీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి కొంతమంది ప్రముఖులు చైనా ఉత్పత్తులను, చైనా మొబైల్ యాప్‌లను బహిష్కరించాలని పిలుపునిస్తూ భారత్‌-చైనాల మద్య సహృధ్భావ వాతావరణం పాడుచేయాలని ప్రయత్నిస్తున్నారని ఒక కధనం ప్రచురించింది. 

కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ భారత్‌లో చైనా హోటల్స్, చైనా ఆహార పదార్ధాలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునివ్వడాన్ని గ్లోబల్ టైమ్స్ తప్పు పట్టింది. కరోనాను కట్టడిచేయడంలో వైఫల్యం చెందినందునే దేశంలో 3.60 లక్షల కేసులు పేరుకుపోయాయని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని ప్రజల దృష్టిని మళ్ళించేందుకే ప్రభుత్వంలో కొందరు ఈవిధంగా చైనా వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. 

అయితే భారత్‌లో కొందరు స్వార్ధపరుల స్వీయప్రయోజనాల కోసం సరిహద్దు సమస్యలను వాణిజ్య వ్యవహారాలతో ముడిపెట్టి చైనా ఉత్పత్తులపై నిషేదం విధించాలనుకోవడం అవివేకమేనని గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది. ఇటువంటి సమయాలలో భారత్‌ ప్రజలు, ముఖ్యంగా...యువత తీవ్ర భావోద్వేగంతో చైనాకు వ్యతిరేకించడం పరిపాటిగా మారిపోయిందని పేర్కొంది. కనుక భారత్‌లో పెరుగుతున్న ఈ ‘చైనా వ్యతిరేకత’కు భారత్‌ ప్రభుత్వం తక్షణమే కళ్ళెం వేయాలని లేకుంటే భారత్‌-చైనా వాణిజ్యవ్యవహారాలపై తీవ్ర ప్రభావంపడుతుందని దాంతో అభివృద్ధి కుంటుపడుతుందని గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. కరోనాను అధిగమించి అభివృద్ధిపదంలో ముందుకు సాగవలసిన ఇటువంటి సమయంలో అభివృద్ధి కుంటుపడేలా ఈవిధంగా చైనా వ్యతిరేకతను పెంచి పోషించడం సరికాదని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.  

భారత్‌ ఆయుధ శక్తి, యుద్ధ సన్నదతపై భారత్‌లో కొందరికి విపరీతమైన నమ్మకం ఉందని అదే సామాన్య ప్రజలకు కూడా వ్యాపింపజేస్తున్నారని ఆ కారణంగానే చైనాతో ప్రత్యక్షయుద్ధం చేసి ఓడించగలదని భ్రమలలో ఉంటున్నారని గ్లోబల్ టైమ్స్ ఆక్షేపించింది. అమెరికా వలలో చిక్కుకొన్న భారత్‌ ప్రభుత్వం కూడా చైనాతో కయ్యానికి కాలు దువ్వాలనుకొంటోందని, అది చాలా అవివేకమైన ఆలోచన అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. 

చైనా ఎప్పుడూ శాంతికాముక దేశమేనని కానీ తన సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తే ఎవరినైనా ధీటుగా ఎదుర్కొని గట్టిగా బుద్ధి చెప్పగలదని కనుక చైనా సహనాన్ని చేతకానితనంగా భావించరాదని గ్లోబల్ టైమ్స్ చెప్పింది. ఈ పత్రిక చెపుతున్నవన్నీ చైనా పాలకుల అభిప్రాయాలేనని వేరే చెప్పక్కరలేదు. 

కానీ అసలు ఇంత హటాత్తుగా భారత్‌-చైనాల మద్య ఇటువంటి ఘర్షణ వాతావరణం ఎందుకు ఏర్పడింది?అని ఆలోచిస్తే చైనా వాదన ఎంత పేలవంగా ఉందో అర్ధమవుతుంది. చైనాయే ప్రపంచదేశాలకు కరోనాను వ్యాపింపజేసిందని, కనుక దానికి చైనాయే బాధ్యత వహించాలని అమెరికాతో సహ పలు అగ్రదేశాలు గట్టిగా వాదిస్తున్నాయి. కనుక ఈ సమస్య నుంచి బయటపడాలంటే అంతకు మించి అందరినీ ఆకర్షించగలిగేది ఏదో ఒకటి చేయకతప్పదు. అందుకు భారత్‌తో కయ్యానికి కాలు దువ్వడం కంటే గొప్ప అంశం మరొకటి ఉండదు. 

భారత్‌తో కయ్యానికి కాలు దువ్వితే గతంలోలాగా భారత్‌ ప్రభుత్వం శాంతి వచనాలు వల్లెవేయదని, తప్పకుండా ధీటుగా స్పందిస్తుందని చైనా పాలకులకు తెలుసు. ఆవిధంగా రెండు అణ్వాయుధ శక్తులైన భారత్‌-చైనాల మద్య యుద్ధమేఘాలు కమ్ముకొన్నట్లు చేయగలిగితే అమెరికాతో సహా అన్ని దేశాలు కరోనా వ్యాప్తిలో చైనాను నిలదీసే బదులు, ఈ ఒట్టొట్టి యుద్ధాన్ని ఏవిధంగా ఆపాలనే ఆలోచిస్తాయని చైనా ఎత్తుగడగా అర్ధం అవుతోంది. అది ఊహించినట్లే ప్రపంచదేశాలు స్పందిస్తున్నాయి కూడా. 

కనుక చైనా తన తప్పును కప్పిపుచ్చుకొని ప్రపంచదేశాల దృష్టిని మరిల్చేందుకు ఈ కుట్ర చేసి, భారత్‌ ప్రభుత్వం కరోనాను కట్టడి చేయలేకనే ఈ నాటకం ఆడుతోందని ఎదురు నిందిస్తుండటం చైనా పాలకుల అతితెలివికి అద్దం పడుతోంది.


Related Post