గజ్వేల్‌కు రైలుబండి వచ్చేసింది

June 19, 2020


img

తమ పట్టణానికి రైలుబండి రావాలనే గజ్వేల్ ప్రజల చిరకాలవాంఛ త్వరలోనే తీరబోతోంది. మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నాలుగు దశలలో చేపడుతున్న రైల్వే లైన్ నిర్మాణంలో మొదటి దశలో భాగంగా మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు గల 31.5 కిమీ రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయింది. వర్గల్ మండలంలోని నాచారం, రాయపోల్ మండలంలోని అప్పాయిపల్లి, గజ్వేల్ పట్టణంలో మూడు చోట్ల రైల్వేస్టేషన్లు, ప్లాట్ ఫారంల నిర్మాణాలు పూర్తయ్యాయి. స్టేషన్లలో టికెటింగ్ కౌంటర్లు, రైల్వే సిబ్బందికి గదుల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. రైల్వే సేఫ్టీ అధికారులు ఇటీవల రైల్వే ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థలు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వడంతో, గురువారం రైల్వే సేఫ్టీ కమీషనర్ రాం కృపాల్ గజ్వేల్ చేరుకొని, రైల్వే అధికారులు రమేశ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, సోమరాజు, జనార్ధన్ తదితరులతో కలిసి రైల్వే ట్రాలీపై గజ్వేల్ నుంచి మనోహరాబాద్ వరకు ప్రయాణించి అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత గజ్వేల్-మనోహరాబాద్ మార్గంలో రైళ్లు నడపడానికి ఆమోదం తెలిపారు.  





దాంతో గురువారం ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం ప్రయోగాత్మకంగా 110 కిమీ వేగంతో సూపర్ ఫాస్ట్ రైలును మనోహరాబాద్ వరకు సింగిల్ లైన్ బ్రాడ్ గేజ్‌పై విజయవంతంగా నడిపించారు. ట్రయల్ రన్ విజయవంతం అవడంతో త్వరలోనే సికింద్రాబాద్‌-కరీంనగర్‌-గజ్వేల్ మద్య రైళ్ళు తిరుగబోతున్నాయి.

మనోహరాబాద్ నుంచి కరీంనగర్‌ వరకు రూ. 1160.47 కోట్లు అంచనా వ్యయంతో మొత్తం 151 కిమీ మేర రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టారు. మొదటి దశలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు, రెండవ దశలో గజ్వేల్ నుంచి సిద్ధిపేట వరకు, మూడవ దశలో సిద్ధిపేట నుంచి సిరిసిల్లా వరకు, నాలుగవ దశలో సిరిసిల్లా నుంచి కొత్తపల్లి వరకు రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టగా దానిలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు మొదటిదశ నిర్మాణపనులు పూర్తయ్యాయి.     

రెండో దశ పనులలో భాగంగా గజ్వేల్ నుంచి సిద్ధిపేట మద్య ట్రాక్ నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. రూ.30 కోట్లు అంచనా వ్యయంతో గజ్వేల్ నుంచి దుద్దెడ వరకు 30కిమీ మేర రైల్వే ట్రాక్ నిర్మించవలసి ఉంది. దీనికోసం టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో పనులు కూడా ప్రారంభం అయ్యాయి. గజ్వేల్ శివారులోను, మండల పరిధిలో రిమ్మన గూడ, కొడకండ్ల శివారు ప్రాంతాలలో మట్టి పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల వంతెనల నిర్మాణ పనులు మొదలయ్యాయి. మంత్రి హరీష్‌రావు తరచూ నిర్మాణ పనులను పరిశీలిస్తూ, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించి నిర్మాణపనులు ఆగకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్, సెప్టెంబరులో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు. 



Related Post