సిఎం కేసీఆర్‌ మంచి ప్రశ్నే వేశారు

June 18, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ నిన్న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సిఎం కేసీఆర్‌ ప్రధాని మోడీని ఒక మంచి ప్రశ్న అడిగారు. “మీరు మీడియాతో మాట్లాడుతారనగానే మళ్ళీ లాక్‌డౌన్‌ ప్రకటించడానికేనని ప్రజలు భావిస్తున్నారు. కనుక దేశంలో మళ్ళీ లాక్‌డౌన్‌ విధించే ఉద్దేశ్యం ఉందా లేదా? అనే విషయంపై స్పష్టం చేయండి,” అని సిఎం కేసీఆర్‌ కోరారు. ప్రధాని నరేంద్రమోడీ స్పందిస్తూ, “ఇకపై లాక్‌డౌన్‌లు ఉండవు. అన్‌లాక్ మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం అన్‌లాక్‌-1 నడుస్తోంది. తరువాత అన్‌లాక్‌-2లో ఎటువంటి విధానాలు, జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైనే మనం చర్చించుకోవాలి,” అని చెప్పారు. 

దేశవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు, మరణాల సంఖ్య శరవేగంగా పెరిగిపోతున్నందున కేంద్రప్రభుత్వం మళ్ళీ లాక్‌డౌన్‌ విధించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే లాక్‌డౌన్‌ కరోనా వ్యాప్తిని తగ్గించగలదు కానీ నివారించలేదని స్పష్టమైంది. అలాగే లాక్‌డౌన్‌ వలన లక్షలాది వలస కార్మికులు ఉపాధి కోల్పోవడంతో వారిని కేంద్రమే ఆదుకోవలసి వస్తోంది. లాక్‌డౌన్‌ దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు అన్నీ మూసుకోవలసివచ్చింది. దాంతో ఆ సంస్థలు నష్టపోయాయి. దాంతో ప్రభుత్వం వాటి నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోయింది. వాటిలో పనిచేసే ఉద్యోగులు రోడ్డున పడ్డారు. దేశం ఇంత భారీ మూల్యం చెల్లించినా కరోనా పోలేదు పైగా నానాటికీ పెరుగుతూనే ఉంది. కనుక లాక్‌డౌన్‌ కొంసాగించడం కంటే ఎత్తివేసి కరోనా వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ పనిచేసుకోక తప్పదని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాయి. అందుకే కేంద్రం కూడా లాక్‌డౌన్‌ ఆలోచనలు మానుకొందని చెప్పవచ్చు. 

అయితే ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లుగా అన్‌లాక్‌-2లో ఎటువంటి విధానాలు, జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైనే మనం చర్చించుకోవాలసిన అవసరముంది. మార్చి 24న లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి డిపోలకే పరిమితమైన మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్ళను, అదేవిధంగా అంతర్జాతీయ విమానసేవలను ఏవిధంగా పునః ప్రారంభించాలి? మూడు నెలలుగా మూతపడిన సినిమాహాల్స్ వగైరాలను ఏవిధంగా నడిపించుకోవాలి?వంటి అంశాలపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించవలసి ఉంది. అలాగే దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న కరోనా కేసులను ఏవిధంగా కట్టడి చేయాలని ఆలోచించాల్సి ఉంది. 


Related Post