కోఠీ ఆసుపత్రి నుంచి కరోనా రోగి పరారి

June 18, 2020


img

హైదరాబాద్‌ కింగ్ కోఠీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి బుదవారం తెల్లవారుజామున పరారయ్యాడు. వరంగల్‌లో రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం వాస్తవ్యుడైన అతను హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేసేవాడు. కరోనా సోకినట్లు నిర్ధారణ అవడంతో ఆరోగ్యశాఖ సిబ్బంది మూడు రోజుల క్రితమే అతనిని కింగ్ కోఠీ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ ఉండటం ఇష్టంలేక బుదవారం ఉదయం ఆసుపత్రి నుంచి తప్పించుకొని స్వగ్రామానికి బస్సులో బయలుదేరినట్లు సోదరుడికి ఫోన్‌ చేసి చెప్పడంతో అతను వెంటనే స్థానిక పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు.

దాంతో అప్రమత్తమైన పోలీసులు, ఆరోగ్యశాఖ సిబ్బంది తొర్రూరు బస్టాండ్ వద్ద కాపుకాసి పట్టుకొని అంబులెన్సులో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతను కింగ్ కోఠీ ఆసుపత్రి నుంచి ఎల్బీ నగర్‌ చేరుకొని అక్కడి నుంచి బస్సులో సూర్యాపేటకు అక్కడి నుంచి మరో బస్సులో తొర్రూరు చేరుకొన్నట్లు చెప్పడంతో పోలీసులు, ఆరోగ్యశాఖ సిబ్బంది ఆ రెండు బస్సులను, వాటిలో ప్రయాణించినవారిని గుర్తించే పనిలోపడ్డారు. ఓ కరోనా రోగి ఈవిధంగా ఆసుపత్రి నుంచి తప్పించుకొని బహిరంగంగా ప్రజల మద్య తిరుగుతూ స్వగ్రామం చేరుకోవడంతో దారిలో ఎంతమందికి కరోనా వ్యాపింపజేశాడో ఊహించడం కష్టమే. 

రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కరోనా రోగులకు లక్షల రూపాయలు ఖర్చయ్యే కరోనా చికిత్సను ఉచితంగా అందజేస్తోంది. ఏ ప్రభుత్వామైన ఒక స్థాయి వరకు మాత్రమే ఈ భారం భరించగలదు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా చికిత్సకు అనుమతించి, దానికి రోజువారీ ఛార్జీలను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణ జనరల్ వార్డులో అయితే రోజుకు రూ.4,500, ఐసీయూలోనైతే రోజుకు రూ.7,500, వెంటిలేటరు కూడా పెట్టవలసివస్తే రోజుకు రూ.9,000 ఛార్జీలుగా నిర్ణయించింది. కరోనా రోగి పూర్తిగా కోలుకోవాలంటే వ్యాధి తీవ్రతను బట్టి 15-45 రోజులు పడుతుందని వైద్యులు చెపుతున్నారు. ఆ లెక్కన కరోనా సోకితే చికిత్సకు కనీసం రూ.50,000 నుంచి రూ.3-4 లక్షలు చెల్లించవలసి ఉంటుంది. అంత ఖరీదైన చికిత్సను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంటే ఈవిధంగా పారిపోవడం అవివేకమే కాదు సమాజం పట్ల బాధ్యతారాహిత్యం కూడా. ఈవిధంగా తెలిసో తెలియాకో ప్రజలకు కరోనాను వ్యాపింపజేసి, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కల్పించినందుకు ఇటువంటివారికి చట్టప్రకారం శిక్షించవలసిన అవసరం ఉంది.


Related Post