కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని కాటేసిన లాక్‌డౌన్‌!

June 16, 2020


img

సోమవారం రాత్రి లడక్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద విధులు నిర్వహిస్తున్న భారత్‌ దళాలపై చైనా సైనికులు అకస్మాత్తుగా దాడి చేసినప్పుడు జరిగిన ఘర్షణలలో ఇద్దరు జవాన్లు, ఒక కమాండింగ్ ఆఫీసర్ చనిపోయారు. కమాడింగ్ ఆఫీసరుగా చేస్తున్న బిక్కుమల్ల సంతోష్ బాబు సూర్యాపేట జిల్లాకు చెందినవ్యక్తి. ఆయన గత ఏడాదిన్నరగా సరిహద్దులలో విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలల క్రితమే ఆయనకు హైదరాబాద్‌ బదిలీ అయ్యింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అదే ఆయన పాలిట, ఆయన కుటుంబపాలిట శాపంగా మారింది. హైదరాబాద్‌ తిరిగివెళ్ళలేకపోవడంతో సంతోష్ బాబు భారత్‌-చైనా సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తుండిపోయారు. దురదృష్టవశాత్తు సోమవారం రాత్రి చైనా సైనికుల దాడిలో సంతోష్ బాబు చనిపోయారు.


ఈ విషయం తెలిసి ప్రస్తుతం డిల్లీలో ఉంటున్న ఆయన భార్య సంతోషి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారికి అభిజ్ఞ (9) అనే ఓ కుమార్తె, అనిరుధ్ (4) అనే ఓ కుమారుడు ఉన్నారు. నేడో రేపో డిల్లీకి తిరిగి వస్తే అందరూ కలిసి హైదరాబాద్‌ తిరిగివెళ్ళిపోవాలని భార్య పిల్లలు, అత్తగారు అందరూ ఎదురు చూస్తూంటే హటాత్తుగా ఈ దారుణమైన వార్త వినవలసి వచ్చింది. ప్రస్తుతం డిల్లీలో కరోనా కేసులు కూడా భారీగా పెరిగిపోవడంతో ఎవరూ ఇంట్లో నుంచి బయటకు కదలలేని పరిస్థితి నెలకొని ఉంది.


Related Post