కరోనాను దాచిపెడితే దాగుతుందా?

June 16, 2020


img

తెలంగాణ ప్రభుత్వం తగినన్ని కరోనా పరీక్షలు చేయడంలేదని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ధైర్యం కల్పించేందుకే నేటి నుంచి రాజధాని హైదరాబాద్‌తో సహా నాలుగు జిల్లాలలో 50,000 మందికి కరోనా పరీక్షలు చేయబోతున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ స్వయంగా చెప్పడం విశేషం. 

కరోనా పరీక్షల విషయంలో కేంద్రప్రభుత్వం, హైకోర్టు, ప్రతిపక్షాలు కూడా తెలంగాణ ప్రభుత్వతీరును తప్పు పట్టాయి. హైదరాబాద్‌తో సహా తెలంగాణ జిల్లాలలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో, ఇంకా ఉపేక్షిస్తే పరిస్థితులు చెయ్యి దాటిపోవచ్చుననే భయంతో, అప్పుడు ఇంకా ఎక్కువ విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే భయంతోనో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కరోనా పరీక్షలకు సిద్దమై ఉండవచ్చుననే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. 

తెలంగాణ ప్రభుత్వం చాలా దూరదృష్టితో వ్యవహరించి కరోనాను కట్టడి చేసిందని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. కానీ తెలంగాణలో కరోనా తీవ్రత, వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసి ఉన్నప్పటికీ మద్యలో కరోనా పరీక్షలు చేయడం తగ్గించేయడం, తత్ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరిగిపోవడాన్ని ఏమనాలి? వైఫల్యమా దూరదృష్టా? అనే ప్రశ్న వినపడుతోంది. అదే...మొదటి నుంచి నిరంతరంగా కరోనా పరీక్షలు జరుపుతున్నట్లయితే వెంటవెంటనే రోగులను గుర్తించి వారిని మిగిలిన ప్రజల నుంచి వేరు చేస్తే రాష్ట్రంలో నేడు మళ్ళీ ఇంతగా కరోనా కేసులు పెరిగి ఉండేవే కావని ఖచ్చితంగా చెప్పవచ్చు. అప్పుడు కరోనా పరీక్షలు ఎందుకు చేయలేదో చెప్పలేకపోతున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు భారీగా ఎందుకు చేస్తోందో చెప్పుకోగలుగుతున్నందుకు సంతోషించాల్సిందే. 

దేశవ్యాప్తంగా రోజుకు 10-11,000 కొత్త కేసులు నమోదవుతుంటే ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని కేంద్రం చెపుతుండటం విస్మయం కలిగిస్తుంది. కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకొంది కనుకనే రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సమాజంలో కరోనా లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? కనుక కరోనా ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సర్దిచెప్పుకోవడం కంటే, ఆ దశకు చేరుకొందనే వాస్తవాన్ని అంగీకరించి  కరోనాను అడ్డుకోవడానికి ఇంకా గట్టి చర్యలు చేపడితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. సామాజిక వ్యాప్తి జరగలేదంటూ ప్రజలను మభ్య పెట్టే బదులు వారికి కూడా వాస్తవ పరిస్థితులను తెలియజేసి అందరినీ అప్రమత్తం చేస్తే వారు కూడా కరోనా సోకకుండా జాగ్రత్తపడతారు కదా? 

కరోనా విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకో వాస్తవాలను దాచిపెడుతున్నాయని న్యాయస్థానాలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కారణాలేవైతేనేమి కరోనా అనే కార్చిచ్చును దాచిపెట్టాలనుకొంటే అది దాస్తే దాగేది కాదని అందరికీ తెలుసు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడితే మంచిది కదా? 


Related Post