తమిళనాడులో మళ్ళీ లాక్‌డౌన్‌

June 16, 2020


img

తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రమంతటా కాకుండా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాజధాని చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, చంగల్పట్ జిల్లాలో ఈనెల 19 నుంచి నెలాఖరు వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. 

కిరాణా, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను అమ్మే దుకాణాలు, పెట్రోల్ బంకులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. హోటళ్ళకు ఉదయం 6 నుంచి 8 గంటలలోపు పార్సిల్ ఫుడ్ అందించడానికి మాత్రమే అనుమతించింది. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు తమ నివాసం ఉండే ప్రాంతాల నుంచి 2 కిమీకి మించి వెళ్లకూడధని హెచ్చరించింది. అత్యవసర పనులపై ఇతరప్రాంతాలకు వెళ్ళాలనుకొంటే పోలీసులు పాసులు జారీ చేస్తారు. ఆదివారం రోజున భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వస్తుండటం వలన ఆరోజు కరోనా కేసులు బారీగా పెరుగుతున్నట్లు గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 21, 28 తేదీలలో పూర్తిగా కర్ఫ్యూ అమలుచేయబోతున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవలకు లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది.

తమిళనాడులో మంగళవారం వరకు మొత్తం 46,504 కేసులు నమోదు కాగా వాటిలో 20,681 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,344 మంది కోలుకొని ఇళ్ళకు తిరిగి వెళ్ళగా 479 మంది కరోనాతో చనిపోయారు. ప్రతీరోజు సుమారు 1500 కొత్త కేసులు నందవుతుండటంతో తక్షణం కరోనాను కట్టడి చేయకపోతే పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశ్యంతో మళ్ళీ లాక్‌డౌన్‌ విధించింది.        



Related Post