ఎయిర్ ఇండియా విమానంలో కరోనా రోగి మృతి?

June 15, 2020


img

వందే భారత్‌ మిషన్‌లో భాగంగా నైజిరియాలో చిక్కుకుపోయిన ప్రవాసభారతీయులను లాగోస్‌ నుంచి ముంబై తీసుకువస్తున్నప్పుడు, కరోనా లక్షణాలతో ఉన్న 42 ఏళ్ళు వయసున్న వ్యక్తి విమానంలో చనిపోవడం కలకలం సృష్టించింది. శనివారం రాత్రి లాగోస్ నుంచి ముంబైకి బయలుదేరిన ఏఐ 1906 విమానంలో ఈ ఘటన జరిగింది. అతను హటాత్తుగా కుప్పకూలి చనిపోయినట్లు ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు చెప్పారు. కానీ అతను విమానం ఎక్కినప్పటి నుంచి జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని తోటి ప్రయాణికులలో కొందరు మీడియాకు తెలిపినట్లు సమాచారం.

విమానం ముంబై విమానాశ్రయం చేరుకొన్న తరువాత అతని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, విమానాన్ని పూర్తిగా శానిటైజ్ చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారులు చెప్పడం ఆ అనుమానాలకు బలం చేకూర్చినట్లుంది. ఒకవేళ అతను కరోనాతో చనిపోయినట్లు లేదా అతనికి కరోనా ఉన్నట్లు కానీ నిర్ధారణ అయితే ఆ విమానంలో అతనితో కలిసి ప్రయాణించిన వారందరికీ కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. విదేశాలలో చిక్కుకొన్నవారిని భారత్‌ తీసుకువస్తున్నప్పుడు తప్పనిసరిగా వారికి వైద్యపరీక్షలు చేసి కరోనా లేదని నిర్ధారణ చేసుకోవాలని నిబందన ఉన్నప్పుడు, కరోనా లక్షణాలున్న ఆ వ్యక్తిని విమానంలోకి ఏవిధంగా అనుమతించారనే ప్రశ్నకు ఎయిర్ ఇండియా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 


Related Post