కరోనా రోగానికి మరో రెండు కొత్త లక్షణాలు

June 13, 2020


img

ఇప్పటివరకు జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కరోనా సోకినట్లు గుర్తించేవారు. ఆ తరువాత ఒళ్ళు నొప్పులు, అలసట, కళ్ళు ఎర్రబడటం, విరేచనాలు అనే మరో మూడు లక్షణాలను కూడా కరోనా ప్రాధమిక నిర్ధారణలో భాగం అయ్యాయి. ప్రపంచఆరోగ్య సంస్థ సూచనల మేరకు కేంద్రప్రభుత్వం తాజాగా మరో రెండు కొత్త లక్షణాలను కూడా ఆ జాబితాకు చేర్చింది. ఆకస్మికంగా రుచి, వాసనలను కోల్పోవడం కూడా కరోనా లక్షణాలుగా పేర్కొంది. కోవిడ్-19, క్లినికల్ మేనేజిమెంట్ ప్రోటోకాల్ కింద ఈ రెంటినీ కూడా కరోనా లక్షణాలుగా గుర్తిస్తున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. అయితే కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యనిపుణులు అభిప్రాయాలను తీసుకొని నిర్ధారించుకొంటామని కేంద్రం తెలిపింది. కరోనాకు ఇంకా వ్యాక్సిన్ ఎప్పుడు సిద్దమవుతుందో తెలియదు కానీ, రోజురోజుకీ కరోనా కొత్త లక్షణాలతో విజృంభిస్తోంది. అంటే శరీరంలో వివిద వ్యవస్థలను కరోనా దెబ్బ తీస్తోందని భావించవచ్చు. 

ప్రయాణాలకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరికాదు: రైళ్ళు, బస్సులు, విమానాలలో ప్రయాణించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆరోగ్యసేతు మొబైల్ యాప్ కలిగి ఉండాలనే నిబందనను సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఆ కేసు విచారణలో కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం, ప్రయాణాలకు ఆరోగ్యసేతు మొబైల్ యాప్ కలిగి ఉండాలనే నిబందన, ఆంక్షలు ఏవీ విధించలేదని తెలిపింది. కరోనా లక్షణాలు ఏవీ లేవని ప్రయాణికులు లిఖితపూర్వ హామీ పత్రం ఇచ్చినా సరిపోతుందని తెలిపింది.


Related Post