ప్రజలు, వైద్యులు తన్నుకొనే దుస్థితి: కోదండరాం

June 13, 2020


img

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళనపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తీవ్రంగా స్పందించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం వైద్యరంగ నిపుణులతో ప్రొఫెసర్ కోదండరాం ఓ రౌండ్ టేబిల్ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రంలో 15 వైద్య కళాశాలలు...వాటికి ఒక్కో దానికి అనుబందంగా 600 పడకలు కలిగిన ఆసుపత్రులు ఉన్నాయి. అదికాక గచ్చిబౌలీ స్టేడియాలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ (టిమ్స్)లో 1,500 పడకలు, వైద్యులు, సిబ్బంది, పరికరాలు అన్ని సిద్దంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. కానీ రాష్ట్రంలో ఏ జిల్లాలోవారికి కరోనా సోకినా వెంటనే గాంధీ ఆసుపత్రికి పంపించేసి చేతులు దులుపుకొంటోంది ప్రభుత్వం. అంటే రాష్ట్రంలో ఇన్ని ఆసుపత్రులున్నా కూడా నాలుగుకోట్ల మంది ప్రజలకు ఒక్క గాంధీ ఆసుపత్రి మాత్రమే సేవలందించాలా?అది సాధ్యమేనా? ప్రభుత్వం చెపుతున్నట్లుగా గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో 1,500 మంది కరోనా రోగులకు చికిత్స అందించగలిగేతే అందరినీ గాంధీ ఆసుపత్రికే ఎందుకు తీసుకువస్తున్నారు? ప్రభుత్వం చెపుతున్న మాటలకు, చేతలకు ఎక్కడా పొంతనలేకపోవడం వలననే ప్రజలు, వైద్యులు కొట్టుకొనే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలి లేకుంటే మున్ముందు పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది,” అని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైద్యరంగ నిపుణులు కూడా ఇంచుమించు ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేసారు. 

కరోనా మహమ్మారి గురించి అవగాహన ఏర్పడని కొత్తలో పొరపాట్లు దొర్లడం సహజం. కానీ రెండున్నర నెలలుగా కరోనా ప్రభావం చూసిన తరువాత అయినా ప్రభుత్వం, ప్రజలు కూడా జాగ్రత్తపడటం చాలా అవసరం. కానీ నేటికీ జిల్లా స్థాయిలో కరోనా చికిత్సలకు ఏర్పాటు చేయకుండా గాంధీ ఆసుపత్రికే కరోనా రోగులను పంపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే విషయంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు వారు రాజకీయ దురుదేశ్యంతోనే చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కొట్టిపడేశారు. కానీ ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్లే రోడ్లపైకి వచ్చి తమపై ఒత్తిడి పెరిగిపోతోందంటూ ఆందోళనలు చేయడం వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టినట్లయింది. అందుకే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపగలుగుతున్నాయి.


Related Post