చైనాలో మళ్ళీ కరోనా కలకలం?

June 13, 2020


img

ప్రపంచానికి కరోనాను అంటించిన చైనా ఆ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడగలిగినట్లు చెప్పుకొంది. కానీ చైనా రాజధాని బీజింగ్‌లో మళ్ళీ 45 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. స్థానిక జిన్‌ఫాడి హోల్‌సేల్‌ ఫిష్ అండ్ మీట్ మార్కెట్‌లో కొంతమందికి కరోనా లక్షణాలు కనబడటంతో పరీక్షలు నిర్వహించగా 45 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్న సాల్మన్ అనే రకం చేపలను అమ్ముతున్న దుకాణాలలో వారికే ఎక్కువగా కరోనా సోకుతున్నట్లు గ్రహించడంతోఆ పరిసర ప్రాంతాలలో లాక్ డౌన్ విధించి, మార్కెట్లలో ఆ రకం చేపల అమ్మకాలను ప్రభుత్వం నిషేదించింది. 

కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప దానిని అడ్డుకోలేమని ప్రపంచదేశాలన్నీ గ్రహించిన తరువాత తమ ప్రజలను, ఆర్ధిక వ్యవస్థలను కాపాడుకొనేందుకు క్రమంగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నాయి. ఇదే విషయం చైనా అన్ని దేశాల కంటే చాలా ముందే గ్రహించి ఉండవచ్చు. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు చాలా భారీగా చైనా ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. కరోనాకు భయపడి వాటిని నిలిపివేసుకొంటే వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కోట్లాదిమంది ప్రజలు రోడ్డున పడతారు. ఎగుమతులు నిలిచిపోతే వాటిద్వారా లభించే విదేశీమారకం కూడా నిలిచిపోయి దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. అందుకే చైనాలో కరోనా ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ ఎత్తివేసి ఉండవచ్చు తప్ప కరోనా లేదని కాదు. 

భారత్‌ కంటే ఎక్కువ జనాభా (139. 27కోట్లు) ఉన్న చైనాలో లాక్‌డౌన్‌ ఎత్తివేసినా కరోనా వ్యాపించడం లేదంటే నమ్మశక్యంగా లేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత భారత్‌లో రోజుకు సుమారు 10,000 కొత్త కేసులు నమోదవుతుంటే  చైనాలో కేవలం 45 కొత్త కేసులు మాత్రమే బయటపడ్డాయంటే నమ్మశక్యంగా లేదు. కరోనా కేసులు, మరణాలు, వాప్తి, రోగనివారణకు అనుసరిస్తున్న వైద్య విధానాలు వగైరాలన్నిటిపై చైనా ప్రభుత్వం చాలా గోప్యత పాటిస్తోందని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కనుక ప్రపంచదేశాలకు తనపై ఇంకా ఇంకా అనుమానాలు పెరుగకుండా మభ్య పెట్టేందుకే అప్పుడప్పుడు కొన్ని కేసులు బయటపడ్డాయని చెప్పుకొంటున్నట్లు భావించవచ్చు. కనుక కరోనా విషయంలో చైనా మాటలను నమ్మలేము.


Related Post