వరంగల్‌ భద్రకాళి ట్యాంక్‌ బండ్‌కు తుదిమెరుగులు

June 13, 2020


img

ఎంతో చారిత్రిక ప్రాశస్యత కలిగిన వరంగల్‌ నగరానికి త్వరలో మరో అద్భుతమైన పర్యాటక ఆకర్షణ కూడా తోడవబోతోంది. వరంగల్‌ నగరం నడిబొడ్డున సుమారు రూ.22 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న భద్రకాళి ట్యాంక్‌ బండ్‌ తుదిమెరుగులు దిద్దుకొంటోంది. ఈ నెలలోనే మంత్రి కేటీఆర్‌ దానిని ప్రారంభించబోతున్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హృదయ్ పధకంలో భాగంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధార్టీ (కుడా), గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్లూఎంసీ) కలిసి దీనిని అభివృద్ధి చేస్తున్నాయి. వరంగల్‌ భద్రకాళి ఆలయం పక్కనే ఉన్న చెరువును ఆనుకొని దీనిని నిర్మిస్తున్నందున దీనికి భద్రకాళి ట్యాంక్‌ బండ్‌ అని నామకరణం చేసారు. 

దీనిలో 1.1 కిమీ పొడవు కలిగిన వాక్ వేను ‘కుడా’ అభివృద్ధి చేస్తుండగా, జీడబ్లూఎంసీ పార్కును అభివృద్ధి చేస్తోంది. వాక్ వేకు ఇరుపక్కల చెట్లు, పూలమొక్కలు వేశారు. ఇదికాక కీళ్ళు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు వాకింగ్ చేసేందుకు వీలుగా రబ్బరు టాపింగ్‌తో చేసిన మరో వాక్-వేను కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్యాంక్‌ బండ్‌ పార్క్‌లో మరో ప్రత్యకత ఏమిటంటే వరంగల్‌ చారిత్రిక ప్రాధాన్యతను గుర్తు చేసేవిధంగా రాతి స్తంభాలు, ఆర్చ్ లు నిర్మించారు. పార్కులో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు రకరకాల పూలమొక్కలు, పార్కుకు వచ్చే ప్రజలు కూర్చొని సేదతీరేందుకు ఎక్కడికక్కడ అవసరమైన ఏర్పాట్లు చేశారు. 

పార్కుకు వచ్చేవారు వ్యాయామం చేసుకొనేందుకు వీలుగా కొన్ని జిమ్ పరికరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్కుకు సమీపంలోనే ఉన్న జైన మందిరాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో ట్యాంక్‌ బండ్‌ అంటే హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ గుర్తుకువచ్చేది. కానీ ఇప్పుడు ఈ భద్రకాళి ట్యాంక్‌ బండ్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 105 నియోజకవర్గాలలో 90 ట్యాంక్‌ బండ్‌లు సిద్దం అవుతునాయి. వాటి నిర్మాణపనులు ప్రస్తుతం వివిద దశలలో కొనసాగుతున్నాయి. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.319.51 కోట్లు కేటాయించగా 2019 వరకు రూ. 190 కోట్లు ఖర్చు చేసింది. 

వాటిలో మహబూబ్‌నగర్‌, సిద్ధిపేట, దుబ్బాక, బోన్‌గిరి, సూర్యాపేట, ఆలేర్, నల్గొండ, ధర్మపురి, మానకొండూర్, సిరిసిల్లా, కోరుట్ల, జగిత్యాల, దొరనాకల్, ఖమ్మంలో నిర్మిస్తున్న మినీ ట్యాంక్‌ బండ్‌ల నిర్మాణాలు దాదాపు తుది దశకు చేరుకొన్నాయి. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 15, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 13, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12, సంగారెడ్డిలో 11, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11, నిర్మల్‌లో 10, రంగారెడ్డిలో 9, ఖమ్మంలో 9, నిజామాబాద్‌ జిల్లాలో 8 మినీ ట్యాంక్‌ బండ్‌లు నిర్మించబడుతున్నాయి. 

ఇప్పటికే పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రమంతా ఇవన్నీ పూర్తయితే మరింత ప్రత్యేకత సంతరించుకోబోతోంది.


Related Post