మహా...విషాదం...లక్ష దాటిన కరోనా కేసులు

June 12, 2020


img

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. శుక్రవారం 3,493 కొత్త కేసులు నమోదవడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,01,141కి చేరింది. ఈ ఒక్కరోజే మహారాష్ట్రలో 127 మంది కరోనాతో చనిపోయారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 3,717 మంది చనిపోయారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 46,078 కోలుకొని ఇళ్లకు తిరిగి చేరుకోగా ప్రస్తుతం 51,346 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 

ఇక మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఒక్క ముంబై నగరంలోనే 54,085 కేసులు నమోదు కాగా వారిలో 27,922 మంది చికిత్స పొందుతున్నారు. నేటి వరకు 24,209 మంది కోలుకోగా 1,954 మంది కరోనాతో మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో 4,320 కేసులు, 165 మంది మరణిస్తేనే ఆందోళన చెందుతున్నప్పుడు మహారాష్ట్రలో ఏకంగా లక్షకు పైగా కేసులు, 3,717 మరణాలు అంటే అక్కడి ప్రజలు ఎంతగా ఆందోళన చెందుతున్నారో...అక్కడి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉండి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.   

 రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో మహారాష్ట్రలో పరిశ్రమలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు కొనసాగించలేని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అయితే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి.మంత్రులు జితేంద్ర అవధ్‌, అశోక్‌ చవాన్‌, ధనుంజయ్‌ముండేలకు కరోనా వైరస్ సోకిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.   

ధారావి మురికివాడలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో అక్కడ నివశిస్తున్న లక్షలాది మంది వలస కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కుటుంబాలతో సహా తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. అయినా వారిని కరోనా భూతం వెంటాడుతూనే ఉంది.

ఒకప్పుడు లక్షలాది ప్రజలతో కళకళలాడిన ముంబై మహానగరంలో ఎక్కడ చూసినా నైరాశ్యమే కనిపిస్తోంది. కరోనా కారణంగా చిరు వ్యాపారులు, హోటల్స్ మొదలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నందున కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప కోలుకోవడం చాలా కష్టమే. మహారాష్ట్ర చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజులివని చెప్పవచ్చు.


Related Post