టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం...మంచిదే

June 12, 2020


img

టీఎస్‌ఆర్టీసీ ఓ కీలకమైన మంచి నిర్ణయం తీసుకొంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 1,200 సిటీ బస్సులను రద్దు చేయడంతో వాటిలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లకు పనిలేకుండా పోయింది. మిగులు సిబ్బంది సేవలను అవసరమైన చోట వినియోగించుకోవాలనే సిఎం కేసీఆర్‌ సూచన మేరకు వారిలో కొందరిని బస్ పాస్ కౌంటర్లలో నియమించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. 

ప్రస్తుతం నెట్‌ ఎక్సెల్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగులు నగరంలోని బస్ పాస్ కౌంటర్లను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థతో టీఎస్‌ఆర్టీసీ చేసుకొన్న పని ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీతో ముగుస్తుంది. కనుక ఆ సంస్థకు కమీషన్ చెల్లించేబదులు, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు ఆ బాధ్యత అప్పగించినట్లయితే వారికి, సంస్థకు కూడా మేలు కలుగుతుందని భావిస్తోంది. కనుక బస్ పాస్ కౌంటర్లను నిర్వహణ కోసం ఖాళీగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులలో ఆసక్తి, అర్హత కలిగినవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 25లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరింది. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి, షిఫ్టు పద్దతులలో పనిచేసేందుకు సిద్దపడేవారు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. 

ఆర్టీసీ డ్రైవర్లలో దాదాపు చాలా మందికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండకపోవచ్చు కానీ కండక్టర్లలో డిగ్రీ వరకు చదువుకొన్నవాళ్ళు ఎక్కువమందే ఉన్నారు కనుక వారికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండవచ్చు. కనుక ఇది వారికి చక్కటి అవకాశమేనని చెప్పవచ్చు.


Related Post