చంద్రబాబునాయుడుపై సిబిఐ విచారణ?

June 12, 2020


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తరువాత మాజీ సిఎం చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అవినీతిని తవ్వి తీసేందుకు మంత్రుల సబ్-కమిటీని ఏర్పాటు చేసారు. ఆ కమిటీ సభ్యులు గురువారం ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని సచివాలయంలో కలిసి తమ నివేదికను అందజేశారు. చంద్రబాబునాయుడు హయాంలో ఏపీ ఫైబర్ గ్రిడ్, చంద్రన్న సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫాలలో భారీగా అవినీతి జరిగిందని నివేదికలో పేర్కొంది. చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీకి ఏడాదికి రూ.26 కోట్లు లబ్ది కలిగించేలా నెయ్యి కొనుగోలు చేయడంవంటివన్నీ కలిపి సుమారు రూ.2,000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. 

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ నివేదికపై లోతుగా చర్చించారు. ఈ అవినీతిలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌, ఆయన సన్నిహితుడు వేమూరు హరికృష్ణతో సహా పలువురు టిడిపి నేతలకు సంబందాలు ఉండవచ్చని మంత్రివర్గం అభిప్రాయపడింది. కనుక ఈ అవినీతి కేసులపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని నిర్ణయించారు. 

వైసీపీ ప్రభుత్వం చెపుతున్నట్లుగా ఒకవేళ చంద్రబాబునాయుడు హయాంలో అవినీతి జరిగి ఉండి ఉంటే చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌లకు మున్ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు.... ఒకసారి సిబిఐ విచారణ మొదలైతే ఇక నుంచి వైసీపీ నేతలు కూడా వారిరువురినీ వేలెత్తి చూపగలుగుతారు. ఇప్పటివరకు టిడిపి నేతలు ఏవిధంగా ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని, విజయసాయిరెడ్డిని అవినీతికేసులలో జైలుకు వెళ్ళివచ్చారంటూ ఎద్దేవా చేస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు వైసీపీ నేతలు కూడా వారిరువురినీ వేలెత్తి చూపి ఎద్దేవా చేయగలరు.


Related Post