మాజీ మంత్రి, టిడిపి ఎల్పీ నేత కింజారపు అచ్చెనాయుడిని ఈరోజు ఉదయం ఏపీ ఏసీబీ పోలీసులు శ్రీకాకుళంలోని ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసి విశాఖపట్నంకు తరలించారు. గతంలో ఆయన కార్మికశాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ ఆసుపత్రుల కోసం మందులు, వైద్యపరికరాల కొనుగోలులో భారీగా అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్మెంట్ దర్యాప్తులో తేలినందున అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ పోలీసులు తెలిపారు. 
టిడిపిలో చాలా సీనియర్ నేత అయిన అచ్చెనాయుడిని అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేయడంపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలలో భాగంగానే అచ్చెనాయుడిని అసత్య ఆరోపణలతో అరెస్ట్ చేయించిందని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ పోలీసులు ఈరోజు ఉదయం అచ్చెనాయుడిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.