మళ్ళీ లాక్‌డౌన్‌ తప్పదా?

June 11, 2020


img

దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రప్రభుత్వం జూన్ 15 నుంచి మళ్ళీ సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించబోతోందనే ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వాటిని కేంద్రం ఖండించింది. 

మొదట ప్రజలను కరోనానుంచి కాపాడుకోవడానికి కేంద్రప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్థను పణంగా పెట్టి లాక్‌డౌన్‌ ప్రకటించింది. కానీ లాక్‌డౌన్‌తో కరోనా వ్యాప్తిని తగ్గించగలము కానీ పూర్తిగా నివారించలేమని గ్రహించిన తరువాత మళ్ళీ దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవడానికి, ప్రజల జీవనోపాధి కోసం లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించసాగింది. 

అప్పటి నుంచి    దేశంలో ప్రతీరోజు సుమారు 10,000 కేసుల చొప్పున పెరుగుతున్నాయి. ఈ లెక్కన రానున్న రెండుమూడు నెలలలో దేశంలో గల్లీగల్లీలో కరోనా రోగులు తయారైనా ఆశ్చర్యం లేదు. అప్పుడు లాక్‌డౌన్‌ ప్రకటించకపోయినా ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. 

కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించి ఏ వ్యవస్థలను కాపాడుకోవాలనుకొందో, ఆ వ్యవస్థలలో పనిచేసే లక్షలాదిమంది ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిని కాపాడుకోవడం కోసం మళ్ళీ లాక్‌డౌన్‌ అమలుచేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ ఊహాగానాలను ఖండిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులను వాస్తవిక దృష్టితో చూసినట్లయితే మళ్ళీ సంపూర్ణ లాక్‌డౌన్‌ అనివార్యమనే అర్ధమవుతోంది. అయితే అది జూన్ 15 నుంచి మొదలవుతుందా లేదా జూలై 15 నుంచి మొదలవుతుందా?అనేదే తేలాలి. కనుక ప్రజలందరూ అందరూ ‘అన్ని విధాలా సిద్దమై ఉండటం మంచిది. 


Related Post