ఏపీలో 5.10 లక్షల మందికి కరోనా పరీక్షలు

June 11, 2020


img

పొరుగు రాష్ట్రం ఏపీలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి నేటి వరకు మొత్తం 5,10,328 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే 10 లక్షల జనాభాలో 9,557 మంది పరీక్షలు చేస్తున్నట్లయింది. దేశంలో ఈ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచింది. కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తున్నందున ఏపీలో కరోనా కేసులు కూడా ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే వారిని సకాలంలో గుర్తించి, ఇతరుల నుంచి వేరు చేసి చికిత్స అందిస్తున్నందున కరోనా వైరస్ సోకి కొలుకొంటున్నవారి (54.67 శాతం) సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బుదవారం డిశ్చార్జ్ అయిన 65 మందితో కలిపి ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 2,540 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఎక్కువ మంది కొలుకొంటున్నందున మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. 

ఏపీతో పోలిస్తే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 4,111 కేసులు నమోదుకాగా వారిలో 156 మంది కరోనాతో మృతి చెందారు. అదే ఏపీలో 5,247 కేసులు నమోదు కాగా వారిలో 80 మంది మాత్రమే మరణించారు. 

గడిచిన 24 గంటలలో ఏపీలో 9,557 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 135 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.


Related Post