మహారాష్ట్ర, తమిళనాడులో విలయతాండవం చేస్తున్న కరోనా

June 11, 2020


img

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో అత్యధికశాతం మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలోవే కావడం ఆ రాష్ట్రాల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మహారాష్ట్రలో 94,041 కరోనా కేసులు నమోదు కాగా తమిళనాడులో 36,841 కేసులు నమోదయ్యాయి. 

మహారాష్ట్ర రాజధాని ముంబైలో 52,667 కేసులు నమోదు కాగా తమిళనాడు రాజధాని చెన్నైలో 25,937 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు రాష్ట్రాలలో ప్రతీరోజు 1,200-1,800 కొత్తకేసులు నమోదవుతుండటంతో రోగులకు చికిత్స చేయడం కష్టంగా మారుతోంది. దాంతో మరణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్నాయి. 

మహారాష్ట్రలో నేటి వరకు 3,438 మంది మరణించగా, ఒక్క ముంబై నగరంలోనే 1,857 మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే కరోనా కేసుల విషయంలోమహారాష్ట్రతో పోటీ పడుతున్న తమిళనాడులో మరణాల సంఖ్య అదుపులో ఉండటం చాలా ఉపశమనం కలిగించే విషయమే. తమిళనాడులో నేటి వరకు 326 కరోనా మరణాలు నమోదయ్యాయి. 

దేశరాజధాని డిల్లీలో 32,810 కేసులు, 984 మరణాలు చాలా దిగ్బ్రాంతి కలిగించే విషయమే. డిల్లీలో కేంద్రప్రభుత్వం కేజ్రీవాల్ నేతృత్వంలో డిల్లీ ప్రభుత్వం కొలువై ఉన్నప్పటికీ కరోనా మహమ్మారిని నియంత్రించలేకపోతుండటం విస్మయం కలిగిస్తుంది.   

ప్రధాన నగరాలలో కరోనాను కట్టడి చేయలేకపోతుండటం వలన అది జిల్లాలకు అక్కడి నుంచి పల్లెలకు పాకుతోంది. ఉదాహరణకు ముంబైకు సమీపంలో ఉన్న థానే జిల్లాలో 14,720 కేసులు నమోదు కాగా 378 మంది మరణించారు. అదేవిధంగా పూణేలో 10,406 కేసులు నమోదు కాగా 439 మరణించారు.

తమిళనాడులో చెన్నై తరువాత చెంగల్పట్టు జిల్లాలో అత్యధికంగా 2,328 కేసులు నమోదయ్యాయి. కంచిలో 600, కడలూరులో 498, అరియలూరులో 384, మధురై జిల్లాలో 343 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 ఈ రెండు రాష్ట్రాల తరువాత స్థానాలలో డిల్లీలో 32,810 కేసులు, గుజరాత్‌-21,554, ఉత్తర ప్రదేశ్-11,160, రాజస్థాన్-11,651, మధ్యప్రదేశ్-10,049, పశ్చిమ బెంగాల్-9,328 కేసులు నమోదయ్యాయి. 

3 నుంచి 6,000 కేసులు నమోదైన రాష్ట్రాలలో కర్ణాటక (6,041), హర్యానా (5,579), ఏపీ (5,247), బీహార్ (5,698), జమ్ముకశ్మీర్‌ (4,507), తెలంగాణ (4,111), ఒడిశా (3,386), అసోమ్ (3,286) ఉన్నాయి.


Related Post