నిద్రలేచి డేంజర్ బెల్ మొగిస్తున్న టెడ్రోస్‌ అధనామ్‌

June 09, 2020


img

చైనాలో వూహన్ నుంచి కరోనా ప్రపంచదేశాలకు వ్యాపించడం మొదలైనప్పుడు నిద్రపోయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోయిన తరువాత టైటానిక్ షిప్ కెప్టెన్ మాదిరిగా మేల్కొని డేంజర్ బెల్స్ మొగిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయో మీడియా ద్వారా రోజూ అందరికీ తెలుస్తూనే ఉంది. కానీ ఆ విషయం ప్రపంచదేశాల ప్రజలకు తెలియజేయకపోతే తెలుసుకోలేరని టెడ్రోస్‌ అధనామ్‌ భ్రమలో ఉన్నారో ఏమో...వాటి గురించి వివరించారు. 

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులలో 75 శాతం అమెరికా, దక్షిణాసియాలోని 10 దేశాలలోనే నమోదవుతున్నాయని చెప్పారు. తూర్పు ఆసియా దేశాలు కరోనా కోరలలో చిక్కుకొన్నాయని, ఆ తరువాత యూరోప్ దేశాలు కరోనా మహమ్మారితో పోరాడుతున్నాయని అన్నారు. చాలా దేశాలలో ప్రజల నిర్లక్ష్యం, అవగాహనారాహిత్యం కారణంగానే కరోనా బారినపడుతున్నారని కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని టెడ్రోస్‌ అధనామ్‌ హెచ్చరించారు. 

కరోనా పుట్టుక, వ్యాప్తి, దాని తీరుతెన్నుల గురించి ప్రపంచదేశాలకు తెలియజేయకుండా చైనా ప్రభుత్వం గోప్యతా పాటించడం, దాని తీవ్రత గురించి పూర్తిగా తెలిసిన తరువాత కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ ప్రపంచదేశాలను సకాలంలో హెచ్చరించకపోవడం, నానాటికీ పరిస్థితులు విషమిస్తున్నప్పుడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అలసత్వం ప్రదర్శించడం లేదా వైఫల్యం చెందడం వలన ఇప్పుడు యావత్ ప్రపంచదేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది కరోనా బారినపడ్డారు. సుమారు 4 లక్షలకు పైగా ప్రజలు మరణించారు. యావత్ ప్రపంచదేశాల ఆర్ధిక, సామాజిక, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కరోనా వైరస్ బారిన పడి లక్షలమంది జీవితాలు కోల్పోతుంటే, వివిద రంగాలు కుప్పకూలిపోతుండటం వలన కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాది, ఆదాయం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. దాంతో కోట్లాదిమంది ఆకలితో అలమటిస్తున్నారు. దీనికంతటికీ చైనా పాలకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ బాధ్యత వహించాల్సి ఉండగా నేటికీ వారిలో ఎటువంటి అపరాధభావం, పశ్చాతాపం కనబడకపోవడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. “తాంబూలాలు ఇచ్చేశాము... తన్నుకు చావండి...” అన్నట్లుగా చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహరిస్తున్నాయిప్పుడు. 


Related Post