గాంధీ ఆసుపత్రిపై దుష్ప్రచారం తగదు

June 09, 2020


img

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి నేటి వరకు అవిశ్రాంతంగా కరోనా రోగులకు చికిత్స చేసి నయం చేస్తున్న గాంధీ ఆసుపత్రిపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని ఇది సరికాదని వైద్యశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. 

కరోనా కేసులు, పరీక్షల విషయంలో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపధ్యంలో వైద్యాధికారులు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తదితరులతో సిఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను ప్రస్తావించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా సిఎం కేసీఆర్‌ను కోరారు. 

గాంధీ ఆసుపత్రి పూర్తి సామర్ధ్యం 2,150 పడకలు కాగా ప్రస్తుతం 247 మంది రోగులు మాత్రమే ఉన్నారు. కానీ గాంధీ ఆసుపత్రి కరోనా రోగులతో నిండిపోయిందని, ఆసుపత్రిలో ఖాళీలేక రోగులను ఇళ్ళకు పంపించివేస్తున్నారని మీడియాలో ఒక వర్గం పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తోందని వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారిని ఇళ్ళకు పంపించి ఇళ్ళలోనే వైద్యం అందిస్తున్నామని వారు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో చాలా మంది కరోనా రోగులు కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇళ్ళకు తిరిగివెళ్లారని వారందరూ చాలా సంతోషంగా ఉన్నారని కానీ మీడియాలో అందుకు భిన్నంగా వార్తలు వస్తుండటం తమకు చాలా బాధ కలిగిస్తోందన్నారు.     

 హైకోర్టు సూచించినట్లుగా రాష్ట్రంలో చనిపోయినవారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని వారు సిఎం కేసీఆర్‌ను అభ్యర్ధించారని సమాచారం. కరోనా విషయంలో రోజూ కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుండటం తమ పనికి ఆటంకంగా మారిందని కనుక ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా వారు సిఎం కేసీఆర్‌ను అభ్యర్ధించారు. 

ప్రపంచంలో అన్ని దేశాలలో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా కూడా కరోనా సోకుతోందని అది చాలా సహజమని తెలంగాణలో కూడా అలాగే జరిగిందని కానీ కేవలం తెలంగాణలో వైద్యులకు మాత్రమే కరోనా సోకినట్లు మీడియాలో వార్తలు వస్తుండటం బాధాకరమని వారు అన్నారు. 

కరోనా రోగులకు గాంధీ ఆసుపత్రి చేస్తున్న సేవలు నిరూపమైనవని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. వైద్యులు, వైద్య సిబ్బంది గత రెండున్నర నెలలుగా తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్నారు. అయితే కరోనా పరీక్షలు, కేసుల విషయంలో మొదటి నుంచి పారదర్శకత లేకపోవడం వలననే కోర్టులు, మీడియా, ప్రజలలో ఇటువంటి అపోహలు ఏర్పడుతున్నాయని చెప్పక తప్పదు. కరోనా కేసులు, పరీక్షల విషయంలో ప్రభుత్వ వైఖరినే వైద్యాధికారులు వ్యక్తం చేసినట్లు కనబడుతున్నాయి. ఉదాహరణకు హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకొన్న సంగతి తెలిసిందే. వైద్యాధికారులు అదే చెప్పారని అర్ధం అవుతోంది.


Related Post