తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

June 08, 2020


img

తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే తగినన్ని కరోనా పరీక్షలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్న హైకోర్టు ఈరోజు మళ్ళీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రులలో చనిపోయినవారికి కరోనా ఉందో లేదో నిర్ధారించుకోకుంటే వారి ద్వారా ఎంతమందికి కరోనా వ్యాపించిందో తెలుసుకోలేము. పైగా కరోనా సోకిన శవాలను వారి బందువులకు అప్పగించేస్తే వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. కనుక ఆసుపత్రులలో చనిపోయినవారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు జరిపించాలని హైకోర్టు ఆదేశించింది. కానీ తమ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

తమ ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే వెళ్లవచ్చు కానీ దీనిపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం అయ్యేలోగా తమ ఆదేశాలను పాటించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం తమ ఆదేశాలను పాటించకపోతే కోరు ధిక్కారంగా భావించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శికి, ప్రజారోగ్య శాఖ డైరెక్టరుకు నోటీసులు జారీ చేసి వారిని బాధ్యులను చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. 

ఉస్మానియా, నీమ్స్ వైద్యులు, వైద్యసిబ్బందికి కరోనా సోకడం గమనిస్తే వారికి తగినన్ని పీపీఈ కిట్లు అందుబాటులో లేవని స్పష్టం అవుతోందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కరోనా లెక్కల గురించి రాష్ట్ర ప్రభుత్వం రోజూ జారీ చేస్తున్న హెల్త్ బులెటిన్‌లలో వాస్తవాలను దాచిపుచ్చి తప్పుడు లెక్కలు చెపుతోందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు, లెక్కల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పారదర్శకంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేస్తూ, అప్పటిలోగా కరోనా పరీక్షలు, లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

 కరోనా పరీక్షలు, లెక్కల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, కేంద్రం కూడా అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వాటిని తేలికగా కొట్టిపాడేశారు. తమ ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే కరోనా పరీక్షలు నిర్వహిస్తోందని వాదించారు. కానీ రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నపుడు విస్తృతంగా కరోనా పరీక్షలు జరిపించాలని హైకోర్టు కోరుతోంది. అప్పుడే పరిస్థితుల తీవ్రత సామాన్యప్రజలకు కూడా అర్ధం అవుతుందని అప్పుడు వారు మరింత జాగ్రత్తగా ఉంటారని హైకోర్టు భావిస్తోంది. 

ఈ విషయంలో హైకోర్టుకు సంతృప్తికరమైన సమాధానం చెపితే సరిపోతుంది కానీ అలా చేయకుండా హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకోవడం ఆ అనుమాలు మరింత పెరిగేందుకు అవకాశం కల్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రతీరోజు 9-12,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం రోజుకు ఎన్ని పరీక్షలు నిర్వహిస్తోందో ఇంతవరకు ప్రకటించడంలేదు?ఎందుకు? అని హైకోర్టు ప్రశ్న. మరి తెలంగాణ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుందో చూడాలి. 


Related Post