చైనాలో 83 వేలు…మహారాష్ట్రలో 85 వేల పాజిటివ్ కేసులు!

June 08, 2020


img

భారత్‌లో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజా లెక్కల ప్రకారం మహారాష్ట్రలో నేటి వరకు 85,975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యావత్ చైనాలో నమోదైన కేసుల కంటే  ఒక్క మహారాష్ట్రలోనే 2,939 కేసులు అధికంగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో శరవేగంగా పెరుగుతున్న కేసులను చూస్తుంటే, త్వరలోనే ప్రపంచంలో అనేక దేశాలను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. 

మహారాష్ట్రలో ఇప్పటి వరకు 39,314 మంది కోలుకొని ఇళ్ళకు తిరిగి వెళ్ళగా మరో 43,601 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. నేటి వరకు 3,060 మంది మరణించారు. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసులలో రాజధాని ముంబైలోనే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. ముంబైలో 48,774 కేసులు నమోదుకాగా వాటిలో 25,946 యాక్టివ్ కేసులున్నాయి. వారిలో 21,190 మంది కోలుకోగా 1,638 మంది కరోనాతో మరణించారు. 

ముంబై నగరానికి అతిసమీపంలో ఉన్న థానే జిల్లాలో 13,014 కేసులు నమోదుకాగా వాటిలో 7,847 యాక్టివ్ కేసులున్నాయి. థానే జిల్లాలో ఇప్పటి వరకు 331 మంది కరోనాతో మరణించారు.

థానే తరువాత ఐ‌టి, పారిశ్రామిక రంగాలకు కేంద్రంగా ఉన్న పూణేలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. పూణేలో 9,705 పాజిటివ్ కేసులలో 3,793 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు 406 మంది మరణించారు. 

మహారాష్ట్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంలో చాలా ఘోరంగా విఫలం అవడంతో ఆ ప్రభావం యావత్ దేశంపై పడుతోంది. భారత్‌లో నమోదైన 2,58,090 కేసులలో 85,975 కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో ఆ రాష్ట్రం నుంచి లక్షలాదిమంది వలస కార్మికులు వారి స్వరాష్టాలకు తిరిగివెళ్లిపోతున్నారు. ఆవిధంగా తిరివస్తున్నవారి ద్వారా అన్ని రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కనుక మహారాష్ట్రలో కరోనాను కట్టడిచేయడానికి కేంద్రప్రభుత్వం కూడా రంగంలో దిగితే మంచిది లేకుంటే మహారాష్ట్రతోపాటు యావత్ దేశం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.


Related Post