కన్నీళ్ళు పెట్టుకొంటే విమర్శలు ఆగుతాయా?

June 08, 2020


img

టిఆర్ఎస్‌ ఎన్నికల వాగ్ధానాలలో నిరుద్యోగులకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మించి ఇవ్వడం వంటివి ఉన్నాయి. ఎన్నికల సమయంలో వాటి గురించి చాలా గొప్పగా ప్రచారం చేసుకొన్న టిఆర్ఎస్‌ నేతలు ఎవరూ ఇప్పుడు వాటి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. ప్రతిపక్షాలు నిలదీస్తే ఎదురుదాడి చేసి నోరు మూయించే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతిపక్షాలను నోళ్ళు మూయించగలరు కానీ వాటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, పేద ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి, అసహనాన్ని చల్లార్చలేరనే సంగతి వారికీ తెలుసు. 

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నిజామాబాద్‌ జిల్లాలో కోటగిరి మండలంలో హంగార్గా గ్రామంలో 30 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఈ హామీని అమలుచేయలేకపోతున్నందుకు కన్నీళ్లు పెట్టుకొన్నారు. “డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణంలో ఎంతో కొంత నష్టమే తప్ప లాభం ఉండకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. నేను, నా కొడుకు కాంట్రాక్టర్లను బ్రతిమాలి ఏదో ఈ మాత్రం కట్టించగలిగాము. ప్రజలకిచ్చిన హామీ నెరవేర్చలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అయితే ఈ సమస్యలేవీ అర్ధం చేసుకోకుండా ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తుండటం ఇంకా బాధ కలిగిస్తోంది,” అంటూ పోచారం కన్నీళ్ళు పెట్టుకొన్నారు. 

ప్రజలకిచ్చిన హామీ నెరవేర్చలేకపోతున్నందుకు వారి ముందే కన్నీళ్ళు పెట్టుకొనే పరిస్థితి ఎందుకు కలిగింది?అంటే ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవడం కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం వలననే అని చెప్పక తప్పదు. హామీ ఇచ్చిన తరువాత వాటిని అమలు చేయనప్పుడు ప్రతిపక్షాలు, మీడియా, ప్రజలు విమర్శించడం సహజం. అందుకు ఇలా కన్నీళ్ళు పెట్టుకోవడమో... ఎదురుదాడి చేయడమో రెండూ సరికాదు. 

ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పి సుమారు 50,000 మంది ఉద్యోగులున్న సంస్థను మూసివేయడానికి కూడా వెనుకాడబోమని సిఎం కేసీఆర్‌ పదేపదే చెప్పారు. మరి ప్రభుత్వమే ఈవిధంగా లాభనష్టాల లెక్కలు కట్టుకొని పనిచేస్తున్నప్పుడు, లాభం సంపాదించడం కోసమే పనిచేసే కాంట్రాక్టర్లు నష్టం భరించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టడానికి ఎందుకు ముందుకు వస్తారు?అని ఆలోచిస్తే ఈ విషయంలో వారిని నిందించడం కూడా సరికాదని అర్ధం అవుతుంది. 

కానీ ప్రజలకిచ్చిన హామీని అమలుచేయాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉన్నట్లయితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏవిధంగా భారీగా నిధులు కేటాయించి పూర్తి చేయించిందో, అదేవిధంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, నిరుద్యోగ భృతి వంటి హామీలను కూడా అమలు చేయవచ్చు. 

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం కాంట్రాక్టర్లవైపు చూసే కంటే గతంలో లాగ రోడ్లు భవనాల శాఖ అధ్వర్యంలోనే చేయించవచ్చు కదా? కానీ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణంపై పెట్టుబడే తప్ప లాభం ఉండదని భావిస్తున్నప్పుడు ఇక అవి ఏవిధంగా పూర్తవుతాయి? లక్షల ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చి అక్కడో పది.. ఇక్కడో 50 ఇళ్ళు కట్టిస్తూ అరకొరగా హామీలను నెరవేర్చడం వలన వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఇవ్వబోయే హామీలను ప్రజలు నమ్మకపోవచ్చు. 


Related Post