కరోనా ప్రైవేట్ చికిత్సకు ధరలు ఫిక్స్

June 06, 2020


img

తమిళనాడు రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటం, ఇదే అదునుగా ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా చికిత్సకు లక్షల రూపాయలు ఫీజులు గుంజుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం ఆసుపత్రుల స్థాయి, రోగుల కరోనా తీవ్రతను బట్టి ఆసుపత్రి ఛార్జీలను ఖరారు చేసింది. 

గ్రేడ్-1, గ్రేడ్-2 ఆసుపత్రులలో  జనరల్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నట్లయితే రోజుకు రూ.5,000 నుంచి గరిష్టంగా రూ.7,500 ఛార్జీలు వసూలు చేసుకోవచ్చునని తెలిపింది. అదే ఐసీయూలో ఉంచి చికిత్స చేయవలసి వస్తే గ్రేడ్- నుంచి గ్రేడ్-4 వరకు అన్ని ఆసుపత్రులలో రోజుకు రూ.15,000 ఛార్జీ వసూలు చేసుకోవచ్చునని తెలిపింది. 

కరోనా రోగులు వ్యాధి తీవ్రతను బట్టి కోలుకోవడానికి 15 నుంచి 30 రోజులు సమయం పడుతుంది. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించినట్లు జనరల్ వార్డులో ఉంటూ చికిత్స చేయించుకోవాలంటే రోజుకు రూ.5,000 చొప్పున 15 నుంచి 30 రోజులకు రూ.75,000 నుంచి 1,50,000 ఖర్చు అవుతుందని స్పష్టం అవుతోంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు ఇటువంటి అవకాశం వస్తే వీలైనంత పిండుకొంటాయి గనుక రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం ఖాయం. ఆ లెక్కన కరోనా నుంచి బయటపడటానికి కనీసం రూ.2,25,000 నుంచి రూ.5,00,000 వరకు సమర్పించుకోక తప్పదు. ఇది ఉన్నతాదాయ వర్గాలకు, మెడికల్ కవరేజ్ ఉన్నవారికి ఇబ్బంది ఉండదు కానీ అవేవీ లేని మధ్యతరగతి ప్రజలకు మాత్రం చాలా కష్టమే.    

దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్న కరోనా చికిత్స ఎంత అమూల్యమైనదో అర్ధం చేసుకోవచ్చు. మున్ముందు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా కరోనా రోగులకు ఉచితంగా చికిత్స చేయించలేని పరిస్థితి తప్పకుండా వస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి కరోనాకు చికిత్స చేయించుకోవాలంటే జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ఆస్తులు కరోనా సమర్పయామి అంటూ కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఆస్తులు కరిగిపోయినా ప్రాణం దక్కుతుందనే నమ్మకం కూడా ఉండదు కనుక కరోనా సోకకుండా ప్రజలందరూ ఇప్పుడే జాగ్రత్తగా పనులు చక్కబెట్టుకోవడం నేర్చుకొంటే చాలా మంచిది. 



Related Post