తెలంగాణలో ఏ పంటలు వేయాలంటే...

May 22, 2020


img

సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు, రైతుబంధు సమితుల అధ్యక్షులు తదితరులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయబోతున్న నూతన నియంత్రిత వ్యవసాయ విధానం గురించి వారికి వివరించారు. దానిలో భాగంగా రాష్ట్రంలో ఏఏ పంటలు ఎన్ని ఎకరాలలో వేయాలి, దాని లాభనష్టాల గురించి కూడా వివరించారు. ఈ వర్షాకాలం నుంచే ఈ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని అమలుచేసేందుకు వీలుగా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మించాలని కోరారు. ఎర్రవల్లిలో తన సొంత ఖర్చుతో రైతు వేదికను నిర్మింపజేస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ నియంత్రిత పంటల విధానం వలన రైతులు ఎక్కువ ప్రయోజనం పొందుతారని కనుక రైతులను ఇందుకు ప్రోత్సహించాలని కోరారు. సిఎం కేసీఆర్‌ ఇంకా ఏమి చెప్పారంటే... 

1. ఈ ఏడాది కూడా వర్షాకాలంలో 40 లక్షల ఎకరాలలో వరిసాగు చేయాలి. వరిలో ఏదో ఓ రకం కాకుండా దేశీయంగా డిమాండ్ ఉన్న సోనా మసూరీ రకం, అలాగే అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న 6.5 ఎంఎం సన్న రకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. 

2. గత ఏడాది53 లక్షల ఎకరాలలో పత్తి పండించారు. ఈ ఏడాది పత్తికి డిమాండ్ ఎక్కువ ఉంది కనుక ఈ ఏడాది 70 లక్షల ఎకరాలలో నాణ్యమైన పత్తి పండించాలి.

3. గత ఏడాది 7 లక్షల ఎకరాలలో కందులు పండించారు. ఈ ఏడాది 15 లక్షల ఎకరాలలో పండించాలి.

4. వర్షాకాలంలో మక్కలు సాగుతో లాభం కంటే నష్టమే ఎక్కువ. కనుక ఈసారి మక్కలకు బదులు పత్తి, కందులు వగైరా వేసుకోవాలి. యాసంగిలో మక్కలు సాగుచేసుకోవచ్చు. 

5.పసుపు, మిర్చి, సోయాబీన్, కూరగాయలు గత ఏడాది మాదిరిగానే వేసుకోవచ్చు. 

6. వివిద రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా యధాప్రకారం విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. 

7. పచ్చిరొట్ట ఎరువు సాగును ప్రోత్సహిస్తాం.  

8. 4-5 రోజులలోపుగానే క్లస్టర్లవారీగా రైతు సదస్సులు ఏర్పాటు చేసి వారికి దిశానిర్దేశం చేయాలి. ఈ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్లు, సింగిల్‌ విండో చైర్‌పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా హాజరవ్వాలి. 

9. రాష్ట్రవ్యాప్తంగా 2,602 వ్యవసాయ క్లస్టర్లలో 4-5 నెలలోగా రైతు వేదికలు నిర్మించాలి. 

10. జిల్లాలవారీగా అగ్రికల్చర్ కార్డులను రూపొందించి వాటి ప్రకారమే పంటలు సాగుచేయాలి. తద్వారా ఏ ప్రాంతంలో ఏ రకం పంటలు, ఎంత దిగుబడి వస్తుందనే విషయం ముందుగానే తెలుస్తుంది. కనుక తదనుగుణంగా మార్కెటింగ్ శాఖ పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసుకోగలదు.   

11. గ్రామస్థాయి వరకు రాష్ట్రవ్యాప్తంగా ట్రాక్టర్లు తదితర వ్యవసాయ యంత్రాలు ఎన్ని ఉన్నాయో, వాటి ప్రస్తుత పరిస్థితి ఏవిధంగా ఉందో జిల్లాలు వారీగా లెక్కలు తీసి, రికార్డులు సిద్దం చేయాలి.  

12. ఈ పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సకాలంలో రైతులకు అందేవిధంగా చూలి. వ్యవసాయ, విత్తనాభివృద్ధి శాఖలు ఇందుకు బాధ్యత తీసుకోవాలి.  

13. ఇకపై పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎక్కడికక్కడ అగ్రికల్చర్ సెజ్‌లు ఏర్పాటు చేసి వాటిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయించి వాటి పక్కనే గోదాములు నిర్మిస్తాము. ఈ సెజ్‌లలో ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, దాల్ మిల్లులతో పాటు ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయిస్తాము.   

14. అన్ని జిల్లా కేంద్రాలలో భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 

15. తక్షణం మార్కెట్ యార్డులు తెరిచి పసుపు కొనుగోళ్ళు మొదలుపెట్టాలి.


Related Post