కరోనా కేసులలో తెలంగాణను ఏపీ మించిపోనుందా?

April 21, 2020


img

రెండు తెలుగు రాష్ట్రాలలో పోలిస్తే మొదటి నుంచి ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న అనేక సమాంతర నివారణ చర్యల వలన రాష్ట్రంలో కరోనా మెల్లగా అదుపులోకి వస్తున్నట్లే కనిపిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నానాటికీ కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నాయి. 

ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 14 కేసులు మాత్రమే నమోదు కాగా ఆంధ్రాలో ఒకే రోజున ఏకంగా 75 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు ఏపీలో 722, తెలంగాణలో 872 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ఇదేవిధంగా కరోనా ఉదృతి పెరుతుంటే త్వరలోనే తెలంగాణను మించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. 

తెలంగాణలో ఇప్పటివరకు 23 మంది, ఏపీలో 20 మంది మృతి చెందారు. ఏపీలో కరోనా మృతుల సంఖ్య కూడా ఈవిధంగా పెరిగిపోవడం గమనిస్తే ఎక్కడో ఏదో లోపం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కనుక కరోనాను కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం మరింత గట్టి ప్రయత్నాలు చేయకతప్పదు. 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనాను పూర్తిగా అదుపు చేసినప్పటికీ ఈవిధంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలలో కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారే ప్రమాదం ఉంది. కనుక కరోనాను కట్టడి చేసే విషయంలో సిఎం కేసీఆర్‌ ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర  ప్రభుత్వాలకు మార్గదర్శనం చేస్తే బాగుంటుందేమో? 


Related Post