కొత్త సంవత్సరం మంచి కార్యక్రమంతో ప్రారంభిద్దాం

December 23, 2019


img

రాష్ట్రంలో పల్లెలు కూడా పచ్చగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలనే మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో నెలరోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలుచేసింది. దానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో చాలా గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. దాంతో ఇకపై ప్రతీ ఆరు నెలలకు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

సిఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో అధికారులతో సమావేశమయ్యి ఈ అంశంపై చర్చించారు. జనవరి 1వ తేదీ నుంచి 10 రోజులు పల్లె ప్రగతి నిర్వహించాలని నిర్ణయించారు. 

ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పంచాయతీరాజ్‌ శాఖలో గ్రామ కార్యదర్శులను నియమించాము. ఆ శాఖలో క్రింద నుండి పైస్థాయి వరకు బలోపేతం చేసి వ్యవస్థను మంచిగా తీర్చిదిద్దుకొన్నాము. కనుక అందుకు తగ్గట్లుగా ఆ శాఖ నుంచి మంచి ఫలితాలు ఆశిస్తున్నాను. ఇంతకు ముందు పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు కానీ చాలా గ్రామాలలో గ్రామ సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం ప్రదర్శించినట్లు నాకు సమాచారం అందింది. ఇది ఎంత మాత్రం సరికాదు. ఈసారి అందరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలి. జిల్లా కలక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు బాధ్యత వహించి ఈసారి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత బాగా నిర్వహించాలి. 

ఇదివరకు రాష్ట్రంలో మొదటిసారి ఇటువంటి కార్యక్రమం అమలుచేసినందున తనికీలు, నివేదికలు, చర్యలు చేపట్టలేదు. కానీ ఈసారి ప్రతీ 12 మండలాలకు ఒకరు చొప్పున ఉన్నతాధికారులతో కూడిన తనికీ బృందాలను ఏర్పాటు చేయబోతున్నాము. వారు ఆయా మండలాలోని గ్రామాలలో అకస్మాత్తుగా పర్యటించి తనికీలు చేసి పనులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తారు. వాటి ఆధారంగా బాగా పనిచేసినవారికి ప్రోత్సాహకాలు, పనిచేయనివారిపై చర్యలు ఉంటాయి. ఇది ఎవరిపైనో కక్ష సాధింపు కోసం కాదు. మన గ్రామాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం, ఈ నివేదికల ద్వారా గ్రామాలలో నెలకొన్న సమస్యల పట్ల ప్రభుత్వానికి మరింత అవగాహన పెంచుకోవడం కోసమే. ఈసారి కొత్త సంవత్సరాన్ని ఒక మంచి కార్యక్రమంతో ప్రారంభిద్దాం. పల్లె ప్రగతి కార్యక్రమం నూటికి నూరు శాతం విజయవంతం చేద్దాం,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.


Related Post