ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం

December 16, 2019


img

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. దీని కోసం ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదముద్ర పడింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న 52,000 మంది కార్మికులు జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులుగా పరిగణింపబడతారని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో నేడు ప్రకటించారు. 

అయితే ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్రప్రభుత్వానికి 33 శాతం వాటా ఉన్నందున, దాని విభజన ప్రక్రియ ఇంకా పూర్తికానందున ఏపీఎస్ ఆర్టీసీని నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదు కనుక రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో ప్రజారవాణా అనే ఒక కొత్త శాఖను సృష్టించి, దానిలోకి 52,000 మంది ఆర్టీసీ కార్మికులను బదిలీ చేసుకొంటోంది. తద్వారా వారందరూ రోడ్లు, భవనాల శాఖలో ఉద్యోగులవుతారు కనుక ప్రభుత్వోద్యోగులుగా పరిగణింపబడతారు. 

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేసినా సిఎం కేసీఆర్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అంగీకరించలేదు. పైగా ఆర్టీసీ కార్మికులు భవిష్యత్‌లో మళ్ళీ ఎన్నడూ సమ్మె చేయకుండా ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేస్తున్నారు. ఆర్టీసీని పునరుద్దరించే ప్రయత్నాలలో భాగంగా హైదరాబాద్‌ జంటనగరాల నుంచి సుమారు 1,000 బస్సులను సర్వీసుల నుంచి తొలగించి వాటి స్థానంలో అద్దెబస్సులు ప్రవేశపెట్టబోతున్నారు. దాంతో ఆ బస్సులలో పనిచేస్తున్న 4,000 మంది ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనతో ఉన్నారిప్పుడు. ఏపీలో ఆర్టీసీ కార్మికులకు జగన్ ప్రభుత్వం ఉద్యోగభద్రత, ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతాలు, సౌకర్యాలు కల్పిస్తుంటే టీఎస్‌ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికులకు భవిష్యత్‌ అగమ్యగోచరంగా కనబడుతుండటం చాలా బాధాకరం. అయితే టీఎస్‌ఆర్టీసీ కార్మికులందరూ తాను చెప్పినట్లు బుద్దిగా పనిచేస్తే రెండేళ్ళలో అందరికీ లక్ష రూపాయలు బోనస్ అందుకొనేలా చేస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పిన మాటలే ఆశాదీపంలా కనబడుతున్నాయి.


Related Post