తెలంగాణలో కూడా సర్జికల్ స్ట్రైక్: లక్ష్మణ్‌

November 23, 2019


img

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దం అవుతుండగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్‌తో కలిసి బిజెపి శాసనసభాపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు తెల్లవారుజామున హడావుడిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారాలు చేశారు. శివసేన దానిని తమపై బిజెపి జరిపిన ‘సర్జికల్ స్ట్రైక్’ అని అభివర్ణించింది. 

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని సాక్షాత్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హెచ్చరించడం విశేషం. పెద్దపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న సిఎం కేసీఆర్‌పై కూడా బిజెపి సర్జికల్ స్ట్రైక్ చేయడం ఖాయం. సిఎం కేసీఆర్‌ బాహుబలి అయితే...ప్రధాని నరేంద్రమోడీ ఒక అణ్వస్త్రం వంటివారు. ఆయన ముందు ఏ బాహుబలి నిలవలేరు. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత సిఎం కేసీఆర్‌ ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి సిద్దం అవుతున్నారు. ఒకవేళ మున్సిపల్ ఎన్నికలలో తెరాసను గెలిపిస్తే సిఎం కేసీఆర్‌ సింగరేణిని అమ్మేయడం ఖాయం. కనుక సింగరేణి మనుగడ మున్సిపల్ ఎన్నికలతో ముడిపడి ఉందని చెప్పక తప్పదు,” అని అన్నారు. 

అధికారం చేజిక్కించుకోవడం మహారాష్ట్రలో...అంతకు ముందు కర్ణాటకలో బిజెపి రాజకీయ సర్జికల్ స్ట్రైక్ చేసిన మాట వాస్తవం. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జెడిఎస్‌ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేల చేత తిరుగుబాటు చేయించి ప్రభుత్వాన్ని కూల్చివేసి బిజెపి అధికారం చేజిక్కించుకొంది. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేలోగానే సర్జికల్ స్ట్రైక్ చేసి అధికారం దక్కించుకొంది. 

అయితే ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 105 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది కనుకనే సర్జికల్ స్ట్రైక్ చేయగలిగిందని చెప్పవచ్చు. కానీ తెలంగాణలో బిజెపికి ఒకే ఒక ఎమ్మెల్యే (గోషామహల్ నుంచి రాజాసింగ్)మాత్రమే ఉన్నారు. కనుక తెరాసలో అసంతృప్త నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల సాయంతో ఒకవేళ తెరాసను నిలువునా చీల్చగలిగినా వారిచేతే ప్రభుత్వం ఏర్పాటు చేయించగలదు కానీ కర్ణాటక, మహారాష్ట్రాలోలాగ  బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అయితే ప్రజలు ఎన్నుకొన్న తెరాస ప్రభుత్వాన్ని కూల్చబోమని, ప్రజాస్వామ్యబద్దంగానే ఎన్నికలలో పోటీ చేసి గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న కె.లక్ష్మణ్‌ ఇప్పుడు అందుకు విరుద్దంగా మాట్లాడటం విశేషం.


Related Post