అమరావతి నిర్మాణం మా ప్రాధాన్యత కాదు: వైసీపీ

November 22, 2019


img

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బ్రేకులు వేసి పునః సమీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో అమరావతి రాజధాని నిర్మాణం కూడా ఒకటి. 

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో రాజధాని నిర్మించే ఉద్దేశ్యం లేదన్నట్లు ఎప్పుడో చెప్పారు. తాజాగా ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ కూడా ‘అమరావతి నిర్మాణం మా ప్రాధాన్యత కాదు...నవరత్నాల అమలే మా ప్రాధాన్యత,” అని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడంపై మీడియాలో ఇంతగా చర్చ జరుగుతున్నప్పటికీ సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంత వరకు ఒక్కసారి కూడా ఆ అంశంపై స్పందించలేదు కానీ రాష్ట్రంలో కొత్తగా విశాఖ, తిరుపతి, అనంతపురంలో మూడు కాన్స్పెట్ సిటీలను నిర్మిస్తామని చెప్పారు. అంటే ఇక అమరావతి నిర్మాణం నిలిచిపోయినట్లే భావించాలేమో?  

రాష్ట్రావిభజన జరిగి ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి ఐదున్నరేళ్ళు గడిచిపోయాయి కానీ ఇంతవరకు రాజధాని లేని రాష్ట్రంగా మనుగడ సాగిస్తుండటం చూస్తే బాధ, ఆశ్చర్యం కలుగుతుంది. గత ప్రభుత్వానికి రాజధాని నిర్మించే గొప్ప అవకాశం లభించినప్పటికీ దానిని సద్వినియోగించుకోలేకపోయింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కారణాలు ఏవైతేనేమీ టిడిపి బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది. కనుక మరో 5 ఏళ్ళకైనా ఏపీకి రాజధాని ఏర్పడుతుందో లేదో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజధాని లేనందుకు ఏపీ ప్రజలు సిగ్గు పడుతున్నారు. చాలా బాధపడుతున్నారు కానీ పాలకులకు మాత్రం అటువంటి ఫీలింగ్స్ ఏవీ ఉన్నట్లు కనిపించకపోవడం చాలా విస్మయం కలిగిస్తుంది.  ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పనిని తరువాత వచ్చిన ప్రభుత్వం‌ పక్కనపెడుతుంటే ఇక ఏపీ ఏవిధంగా అభివృద్ధి చెందుతుంది. ఏపీకి రాజధాని ఎప్పుడు ఏర్పడుతుంది? అని ప్రజలు ప్రశ్నించుకొంటున్నారు. కానీ వారి ప్రశ్నకు సమాధానం చెప్పేవారే లేరు. 


Related Post