తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

November 01, 2019


img

ఆర్టీసీ బకాయిల చెల్లింపుపై ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏస్‌ అధికారులు తయారుచేసిన అఫిడవిట్ తప్పుడు లెక్కలతో గందరగోళపరిచేవిధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశ్యపూర్వకంగానే ఇటువంటి తప్పుడు లెక్కలతో నివేదికలు తయారుచేయించి కోర్టును తప్పు దారి పట్టించాలని ప్రయత్నిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఆర్టీసీకి ఎంత బాకీ ఉన్నాయో పూర్తి వివరాలతో మళ్ళీ మరో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసును నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.  

ఈరోజు విచారణలో హైకోర్టు ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యాయానికి మళ్ళీ కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. 

1. బస్సుల కొనుగోలుకు తీసుకొన్న రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపుగా ఎలా పేర్కొంటారని సూటిగా ప్రశ్నించింది.

2. నిబందనల ప్రకారం జీహెచ్‌ఎంసీ ఆర్టీసీకి సొమ్ము చెల్లించనవసరం లేదనే ఆర్టీసీ యాజమాన్యం వాదనపై స్పందిస్తూ, మరి అటువంటప్పుడు 2015-17 సంలలో జీహెచ్‌ఎంసీ ఆర్టీసీకి రూ.336 కోట్లు ఎందుకు చెల్లించిందని నిలదీసింది. 

3. 2015-16లో జీహెచ్‌ఎంసీ లోటు బడ్జెట్‌లో ఉన్నప్పుడు ఆర్టీసీకి రూ.108 కోట్లు, మరుసటి సంవత్సరంలో రూ.228 కోట్లు చెల్లించగలిగినప్పుడు ఇప్పుడు పరిస్థితి బాగున్నప్పుడు ఎందుకు చెల్లించలేదని నిలదీసింది. 

4. అసలు ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వం బాకీలు ఉన్న మాట వాస్తవామా కాదా? వాటిని చెల్లించాలనుకొంటోందా లేదా? అని సూటిగా ప్రశ్నించింది. 

5. ఆర్టీసీకి ప్రభుత్వం బకాయిలు చెల్లించవలసి ఉందని రవాణామంత్రి అసెంబ్లీలో చెప్పిన మాటను నమ్మాలా లేక బకాయిలు చెల్లించవలసిన అవసరం లేదని వాదిస్తున్న మీ మాట నమ్మాలా? అని ప్రశ్నించింది. 

హైకోర్టు ఒక్కో అంశంపై పట్టి పట్టి నిలదీస్తుంటే ఆర్టీసీ తరపున వాదించిన స్టాండింగ్ కౌన్సిల్ శ్రీధరన్ సైతం జవాబులు చెప్పలేక చాలా ఇబ్బందిపడ్డారు.


Related Post